కేంద్ర మంత్రులు ఎక్కడున్నారు..ఏం చేస్తున్నారో ప్రధానే చెబుతారు.. అంతేనా, వారు ఏం తినాలి.. ఏం వేసుకోవాలోకూడా మోడీనే ఆదేశిస్తారు. ఓవైపు మంత్రులకు సీసీటీవీల బెడద, మరోవైపు.. ఎంపీలకేమో సడన్ ఫోన్ కాల్స్ గోల.. వెరసి.. మోడీ అంటేనే.. వీరందరికీ దడ. దీంతో.. కేంద్రమంత్రులు-టాప్ బ్యూరోక్రాట్లు.. తమ డ్రైవర్లు-పనిమనుషుల ఫోన్లనే వాడాల్సివస్తోంది. మోడీనా మజాకానా .. కేంద్ర మంత్రుల క్యాబిన్లో.. నిఘా పరికరాలు సంచలనం సృష్టించిన విషయం తెరమరుగు కాకముందే.. కేంద్ర మంత్రుల పేషీల్లో ..्క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్లు హల్ చల్ చేయనున్నాయి. పైలెట్ ప్రాజెక్టుకింద..బిలియన్లరూపాయల డబ్బులు మారే వేదికైన.. పెట్రోలియం అండ్ నాచురల్ గ్యాస్ మంత్రిత్వశాఖలో సీసీటీవీలు అమర్చారు. శాస్త్రిభవన్లోని ఈ కార్యాలయంలో మరికొన్ని రోజుల్లో అడుగడుగూ.. ఇంచు ఇంచూ సీసీటీవీ పరిధిలోకి రానుంది. పెద్దపెద్ద మంత్రిత్వ శాఖల కార్యాలయాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా.. ఇలాంటి సీసీటీవీలు అమర్చి.. అవినీతికి స్థానం లేకుండా మోడీ చర్యలు తీసుకుంటున్నారు. ఇదంతా బిగ్ బ్రదర్ షోను తలపిస్తున్నట్టుందని అప్పుడే తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఇక పలువురు కేంద్ర మంత్రుల అనుభవాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. పేర్లు చెప్పేందుకు ఇష్టపడని మంత్రులు.. తమగోడు మీడియా మిత్రులతో వెళ్లగక్కుతున్నారు. మోడీకి అత్యంత సన్నిహితుడైన ఓ కేంద్రమంత్రి.. ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటెల్లో.. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భోజనానికి వెళ్లారు. సదరు మంత్రి బ్రెడ్ తినడం మొదలుపెట్టారో లేదో.. సెల్ మోగింది. ఆవెంటనే అటువైపునుంచి.. ప్రధాని మోడీ స్వయంగా మాట్లాడారు.. మీరు బ్రెడ్ తినడం అయిపోయిందా అన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. సీన్ కట్చేస్తే.. మంత్రిగారు..గబాగబా తినడం ముగించి.. ఆఫీసుకి దౌడు తీశారు. ఇక ..ఫారిన్కి తొలిసారి వెళ్తున్న ఓ కేంద్రమంత్రి.. ఎయిర్పోర్ట్కు వెళ్తుండగా, మోడీ స్వయంగా ఫోన్ చేశారు. స్వదేశమైనా.. విదేశమైనా.. జీన్స్ వేసుకుంటే.. రాజకీయ నాయకులు విమర్శలపాలు కావాల్సి వస్తుందని మోడీ ఫోన్లో హెచ్చరించారు. దీంతో.. డ్రైవర్ను కార్ ఇంటికి పోనిమ్మని చెప్పి.. ఆదరాబాదరాగా కుర్తా పైజమా వేసుకుని..విదేశాలకు పయనమయ్యారు మంత్రిగారు. దీంతో.. మోడీ తమ ప్రతి అడుగూ నిశితంగా గమనిస్తున్నారన్న సందేశం కేంద్ర క్యాబినెట్కు స్పష్టంగా అర్థమైంది. అమాత్యులను అనుక్షణం ఓకంట కనిపెట్టుకునే ఉన్న మోడీ.. వారిని అన్నివిధాల నియంత్రిస్తూ..తన గుప్పిట్లోనే పెట్టుకున్నారు. కేంద్ర మంత్రులకు ఫోన్ కాల్స్ చేయడంను కాసేపు పక్కనపెడితే.. ఇప్పుడు ఎంపీలను కూడా మోడీ గజగజా వణికిస్తున్నారు. ఉన్నట్టుండి, సడన్గా బీజేపీ ఎంపీల సెల్ ఫోన్లు మోగుతున్నాయి.. ఎంపీలు చేస్తున్న పనులను మోడీ ఆరా తీస్తున్నారు. దీంతో.. కమలదళానికి వెన్నులో చలిపుడుతోంది. వీరంతా మోడీ మైక్రోమేనేజ్మెంట్కు విరుగుడునుకూడా కనుగొన్నారు. వ్యక్తిగత ఫోన్లను వినియోగించడం మానేసిన టాప్ బ్యూరోక్రాట్లు, కేంద్రమంత్రులు.. ప్రైవేటు విషయాలకోసం.. డ్రైవర్లు, పనిమనుషుల ఫోన్లను వినియోగిస్తుండడం కొసమెరుపు. మొత్తానికి పీఎంఓ అంటే ఓ స్కానర్లా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: