ఎప్పుడైనా డీజిల్ ధరలు పెరిగితే.. వెంటనే ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు కూడా అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం అవసరమైన కసరత్తు కూడా ప్రారంభిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రెండు మూడేళ్లకు ఒకసారి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచడం వల్ల ప్రయాణీకులపై ఒకేసారి భారం పడుతోంది. దీనివల్ల ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొనాల్సి వస్తోంది. ఇదే సమయంలో ఆర్టీసీ నష్టాలకు కూడా కారణమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. అదే తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో ఎప్పుడు డీజిల్ ధరలు పెరిగినా వెంటనే ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచే విధానం అమలులో ఉంది. అందుకే అక్కడ ఆర్టీసీ నష్టాలు కూడా తక్కువగా ఉంటున్నట్లు అధికారులు అంటున్నారు. ఇప్పుడు ఇదే తరహా విధానాన్ని రాష్ట్రంలో కూడా అమలు చేస్తే ఎలా ఉంటుందన్న భావాన్ని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ భారీ నష్టాల్లో నడుస్తోంది. సంస్థలో నిర్లక్ష్యం ఒకవైపు తాండవిస్తుండగా, మరోవైపు డీజిల్ సమస్య కూడా వేధిస్తోంది. బస్సులు పాతవి కావడంతో మేలేజి సమస్య కూడా ఉత్పన్నమవుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రోజుకు మూడు కోట్లరూపాయల మేరకు నష్టాలు ఉన్నట్లు అధికారులే చెబుతున్నారు. ఈ కారణంగా ప్రత్యామ్నాయ చర్యలు ఆలోచించాల్సిన అవసరాన్ని కూడా వారు గుర్తుచేస్తున్నారు. ఇందులో భాగంగానే తమిళనాడు విధానంపై దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఇలా ఉండగా, గ్రామాల్లో తిరుగుతున్న పల్లె వెలుగు బస్సుల వల్ల కూడా ఆర్టీసీ నష్టాలు వస్తున్నాయన్న నివేదికల కారణంగా పల్లె వెలుగు బస్సుల స్థానంలో మినీ బస్సులను తిప్పే ఆలోచన కూడా చేస్తున్నారు. దీనివల్ల ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా చేయడమే కాకుండా, ఆర్టీసీ నష్టాలను తగ్గించవచ్చునని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇకపై బయో డీజిల్ వినియోగంపై కూడా దృష్టి పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. బయో డీజిల్ వినియోగం వల్ల ఆర్ధికంగా ప్రయోజనాలు ఉంటాయని కూడా అధికారులు చెబుతున్నారు. రహదారుల వల్ల కూడా ఆర్టీసీకి ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో రోడ్ల మరమ్మతులపైనా దృష్టి పెడుతున్నారు. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు వెల్లడించారు. సోమవారం ఆయన శాసనసభ ఆవరణలో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆర్టీసీ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్టీసీ భూములను లీజుకు ఇవ్వడం ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాలో ఆర్టీసీ పరిస్థితిని అధ్యయనం చేస్తున్నామని, అనేక కోణాల్లో వివరాలు సేకరించేందుకు అధికారుల బృంతం కర్నాటక రాష్ట్రంలో కూడా పర్యటిస్తోందని వివరించారు

మరింత సమాచారం తెలుసుకోండి: