తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వేళ.. ఏపీ నష్టపోతోందన్న కారణంతో ఆ రాష్ట్రానికి కొన్ని తాయిలాలు ప్రకటించారు. కేంద్రం నుంచి పన్నురాయితీలుంటాయని విభజన చట్టంలోనే చెప్పారు. అంతేకాకుండా ప్రత్యేక హోదా ఇస్తామని కూడా చట్టంలో పేర్కొన్నారు. కేవలం ఏపీకి మాత్రమే ఇస్తే.. మళ్లీ సమతుల్యత ఉండదనుకున్నారో ఏమో కానీ.. తెలంగాణకూ కొన్ని వరాలు ప్రకటించారు. వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టేవారికి పన్నురాయితీలు ఇస్తామని చట్టంలో పేర్కొన్నారు. బిల్లు పాస్ అయ్యింది. చట్టంగా మారింది కానీ అమలులో మాత్రం చెప్పుకోదగిన పురోగతి లేదు. ఈ అంశంపై ఇప్పటికే కేంద్రంపై వీలైనప్పుడల్లా తెలుగు రాష్ట్రాలు ఒత్తిడి తెస్తున్నాయి. వీరి ప్రయత్నాలకు గండి కొట్టేలా ఇప్పుడు ఓ కొత్త విలన్ తయారైంది. ఆమే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పన్నురాయితీలు ఇవ్వడంపై ఆమె కేంద్రానికి అభ్యంతరం తెలిపింది. అంతే కాదు.. తెలుగురాష్ట్రాలకు పన్ను రాయితీలు ఎలా ఇస్తారంటూ మోడీ సర్కారుకు ఇంతపొడవున ఓ లేఖ కూడా రాసింది. ఏపీ, తెలంగాణలకు పన్నురాయితీలు ఇవ్వడం వల్ల జయలలితకు ఎందుకు కోపమొచ్చిందనుకుంటున్నారా.. దీని వల్ల పొరుగు రాష్ట్రాలకు తీరని నష్టం వాటిల్లుతుదంటోదామె. కేంద్రం.. ఏపీ, తెలంగాణలకు పన్ను రాయితీలు కల్పిస్తే..దక్షిణాదికి వచ్చే పరిశ్రమలు.. ఎక్కువ శాతం ఆ రెండు రాష్ట్రాలకే వెళ్తాయన్నది జయలలిత ఆక్రోశం. దీనివల్ల తమిళనాడుకు పెట్టుబడుల రాక తగ్గుతుందన్నది ఆమె భయం. పన్ను రాయితీల వల్ల రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండదంటూ ఆమె కేంద్రానికి రాసిన లేఖలో పేరొన్నారు. గతంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల ఏర్పాటు సమయంలోనూ పొరుగు రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైందని జయలలిత గుర్తు చేశారు. రాష్ట్రాల పునర్నిర్మాణంపై దృష్టిపెట్టి సహకారం కోసం కేంద్రం వైపు ఆశగా ఎదురు చూస్తున్న తెలుగు రాష్ట్రాలకు జయలలిత లేఖ నిజంగా చేదువార్తే.

మరింత సమాచారం తెలుసుకోండి: