సకలజన సమగ్ర సర్వే... వారం రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన కార్యక్రమం. ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ జన సర్వే ప్రక్రియలో ఇప్పుడు కంప్యూటరీకరణ ఘట్టం కొనసాగుతోంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అంతటి బృహత్తర కార్యక్రమం యావత్ దేశం దృష్టినీ ఇటు వైపు మళ్లించింది. ఎందరు దృష్టి కేటాయించినా... ప్రజల్లో ఎన్ని అపోహలు కలిగినా... వాటన్నిటినీ పటా పంచలు చేస్తూ కేసీఆర్ బృందం సకలజన సర్వేను సమగ్రంగా చేపట్టింది. అదే ఊపుతో ఇప్పుడు మరో చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. కొలువు దీరిన నాటి నుంచి సరికొత్త పంథాతో దూసుకెళ్తున్న కేసీఆర్... ఈసారి తెలంగాణలో భూములన్నింటినీ సమగ్ర సర్వే చేయించే కార్యక్రమానికి ప్రణాళిక రూపొందించారు. స్వాతంత్ర్యం సిద్ధించక ముందు నిజాం హయాంలో మాత్రమే తెలంగాణ భూభాగంలో భూ సర్వే జరిగింది. ఇప్పుడు సుమారు 82 ఏళ్ల తర్వాత తొలిసారి సమగ్రంగా భూములను సర్వే చేయించే ప్లాన్ సిద్ధమయింది. రాష్ట్ర భూభాగంలో ప్రతీ గజాన్ని సర్వే చేయాలని... సరైన లెక్కలతో భూమి రికార్డులు రూపొందించాలనేది ప్రభుత్వ ఆలోచన. సకల జన సర్వేతో సమగ్ర జన సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు భూ సర్వే మీద దృష్టి పెట్టింది. సర్వేతో లాభం ఏమిటి? సమగ్ర భూ సర్వే ఫలితంగా రాష్ట్రంలోని భూములకు సంబంధించి అనేక వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏ భూములు ఎవరివి? ఎవరి ఆధీనంలో ఎంత భూమి ఉంది? అనే వివరాలతోపాటు నేలల రకాలు, భూముల స్వభావాలు, వాటిల్లో పండించాల్సిన పంటల రకాలు వెల్లడి కానున్నాయి. అసలు రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవ సాగు విస్తీర్ణం ఎంత ఉంది, సాగునీరు అందుతున్న భూమలు ఎంత మొత్తంలో ఉన్నాయి, అనే వివరాలు తేలనున్నాయి. కబ్జా కోరల్లో చిక్కుకున్న చెర్వులు, కుంటలతోపాటు బావులు, కాల్వల శిఖం భూమల వివరాలూ తేటతెల్లం కావడం ఖాయం. వీటితోపాటు అన్యాక్రాంతమైన లక్షల ఎకరాల దేవాదాయ భూములు, వక్ఫ్ బోర్డు ఆస్తుల వంటి వాటి అక్రమాలు సైతం వెలుగులోకి వస్తాయి. గత ప్రయత్నాలు... నిజాం హయాంలోని హైదరాబాద్ రాష్ట్రంలో భూముల సర్వే జరిగింది. 1932లో జరిగిన ఆ కార్యక్రమం పూర్తి స్థాయి సమగ్ర సర్వే మాత్రం కాదు. అప్పటి వరకు ఉన్న భూములు ఎవరెవరి పేర్ల మీద ఉన్నాయనే రికార్డుల నమోదు ప్రక్రియ మాత్రమే. ఆ తర్వాత నిజాం పాలన పోయి స్వతంత్ర భారతంలో విలీనమైనా... కోస్తాంధ్రతో కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడినా... ఇప్పటి వరకు ఏ పాలకులూ భూముల సర్వేకు సాహసించలేదు. ప్రస్తుతం ఏ జిల్లాలో చూసినా భూమి రికార్డుల్లో ఎక్కడా సమగ్ర సమాచారం కనిపించని పరిస్థితులే ఉన్నాయి. దీంతో అనేక భూ వివాదాలు దశాబ్దాల తరబడి న్యాయస్థానాల్లో నలుగుతున్నాయి. లక్షల ఎకరాల సర్కార్ భూములలు సైతం లెక్కల్లో లేకుండా పోయాయి. ఎంత ఖర్చవుతుంది? 20 కోట్ల రూపాయల ఖర్చుతోనే సకల జన సర్వేను పూర్తి చేసిన ప్రభుత్వం... సమగ్ర భూ సర్వే కోసం మాత్రం ఎక్కువ మొత్తం ఖర్చు చేయక తప్పదు. అత్యాధునిక సాంకేతికత సాయంతో చేపట్టే ఈ సర్వే భవిష్యత్ తరాలకు సైతం ఉపయోగకరంగా ఉండాలన్నదే కేసీఆర్ ఆలోచన. అందుకే ఈ బృహత్ కార్యక్రమాన్ని వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుతో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఒకటీ, రెండు నెలల్లోనే ఈ సర్వే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం వెయ్యి కోట్లు ఖర్చు అవుతుందని తేల్చిన సర్వే ల్యాండ్ సెటిల్‌మెంట్స్ అండ్ రికార్డుల శాఖ... రెండు నెల్ల క్రితమే కేంద్ర భూ వనరుల శాఖకు ప్రతిపాదనలు పంపింది. దీనిపై స్పందించిన కేంద్రం కూడా ఇందుకోసం జరిగే ఖర్చులో సగం తాము భరిస్తామని చెప్పింది. కానీ తెలంగాణ ప్రభుత్వం పూర్తి నిధులను కేంద్రమే మంజూరు చేయాలని కోరుతోంది. కేంద్ర సాయం...! కేంద్రం పరిధిలోని జాతీయ భూ రికార్డులు, నవీనీకరణ పథకం - ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ నిధులు పుష్కలంగా ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం గతంలోనే వచ్చినప్పటికీ ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. ఎన్టీఆర్ తొలి ప్రభుత్వ హయాంలో ఆలోచన చేసినా ఆచరణకు నోచుకోలేదు. ఇప్పుడు తాజాగా కేసీఆర్ ప్రభుత్వం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దుమ్ము పట్టిన భూమి దస్త్రాలను దులిపే ప్రక్రియ శ్రీకారం చుడుతోంది. కొత్తగా ఏర్పడిని రాష్ట్రం అయినందున పూర్తి నిధులను కేంద్రమే భరించాలని ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం లేఖ రాసింది. సుదీర్ఘ సమయం తీసుకునే అవకాశం ఉన్నందున తక్షణమే తొలి దశలో కొంత మొత్తాన్ని విడుదల చేయాలని కూడా కోరింది. అంతా సజావుగా సాగినా సర్వే పూర్తి కావడానికి మూడు, నాలుగేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాల అంచనా. సాంకేతికత సాయంతోనే... ప్రభుత్వం మరోసారి ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఈ కార్యక్రమంలో పాత పద్దతులను పూర్తిగా పక్కన పెట్టాలని యోచిస్తోంది. గొలుసు పట్టుకొని భూమిని కొలిచే విధానానికి స్వస్తి పలకాలని భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్ సిస్టం - ఈటీఎస్, డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం - డీజీపీఎస్ వంటి అధునాతన సాంకేతిక పద్ధతులను భూ సర్వే కోసం వినియోగించనున్నారు. అవసరమైతే విమానాలను సైతం వాడతారు. చదునుగా ఉండే భూములను, రాళ్లు, గుట్టల వంటి అటవీ ప్రాంతాలను వేర్వేరుగా లెక్కిస్తారు. ఈటీఎస్, డీజీపీఎస్ వ ఆధారంగా హద్దు రాళ్లను వేస్తారు. ఇందుకోసం అనేక విభాగాల సాయం కూడా తీసుకోనున్నారు. ఎక్కడెక్కడైనా జరిగిందా? సమగ్ర భూ సర్వే అనేది తెలుగు నేల పై కొత్త విషయమే కానీ... ఇప్పటికే ఈ సర్వేను అనేక రాష్ట్రాలు విజయవంతంగా నిర్వహించాయి. గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, బీహార్ రాష్టాల్లో ఈ రకమైన సర్వే జరిగింది. కేంద్ర పరిధిలోని నేషనల్ ల్యాండ్ రికార్డు మోడరనైజేషన్ ప్రోగ్రాం కిందనే ఆయా రాష్ట్రాలు కూడా ఈ కార్యక్రమం చేపట్టాయి. ప్రస్తుతం బీహార్ లో సర్వే ప్రక్రియ ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రక్రియ పై పూర్తి అవగాహన కోసం తెలంగాణ అధికారులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటించారు. బీహార్ కు కూడా వెళ్లనున్నారు. మూడు దశలలో సర్వే పూర్తి చేయాలని... వివాదాస్పద ప్రాంతాల్లో తొలి దఫా నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ప్రభుత్వం చేపట్టనున్న ఈ భారీ భూ సర్వే కార్యక్రమానికి సిబ్బంది కొరత వేధించనుంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో సర్వేయర్ పోస్టులు చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. వందలాది మంది సర్వేయర్ల కొరత ఉన్న తరుణంలో ప్రభుత్వం సమగ్ర భూ సర్వే నిర్వహించడం చాలా కష్టమైన పని. అధికార వర్గాలు కూడా ఇదే రకమైన అభిప్రాయంతో ఉన్న నేపథ్యంలో... ఈ సర్వే బాధ్యతలను టెండర్ పద్ధతిన జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలకు అప్పగించనున్నారు. వారి పనులను పర్యవేక్షించేందుకు నాలుగు కమిటీలు పని చేస్తాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 8 సంస్థలు భూ సర్వే చేపట్టే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. వాటిలో ఆరు సంస్థలు హైదరాబాద్‌కు చెందినవే.

మరింత సమాచారం తెలుసుకోండి: