నాలుగువేల మెగావాట్ల విద్యుత్ లోటుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, మిగులు విద్యుత్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని ఈ అంశాన్ని మరుగున పరిచి టిడిపి నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ విమర్శించారు. ఉద్దేశ పూర్వకంగానే తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర పాలకులు విద్యుత్ రంగంలో నిర్లక్ష్యం చేశారని టిఆర్‌ఎస్ కర్నే ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వలస పాలనలో విద్యుత్ రంగంలో తెలంగాణను అన్యాయం చేయడం వల్ల కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడేళ్లపాటు విద్యుత్ సమస్య తప్పదని ఎన్నికలకు ముందే టిఆర్‌ఎస్ ప్రకటించిందని కర్నే ప్రభాకర్ గుర్తు చేశారు. రైతులు బతకలేని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్న టిడిపి ఎమ్మెల్యేలు పిపిఎలను రద్దు చేస్తున్నప్పుడు బాబును ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. ఎన్నికల ప్రణాళికలో సైతం మూడేళ్ల పాటు విద్యుత్ సమస్య ఉంటుందని ప్రజలకు వాస్తవాలే చెప్పామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తామని అన్నారు. అమలుకు సాధ్యమైన హామీలను మాత్రమే ఇచ్చినట్టు చెప్పారు. విద్యుత్ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేస్తూ విద్యుత్ రంగంలో తెలంగాణను ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణలో విద్యుత్ సంక్షోభం పాపం చంద్రబాబుదే నని అన్నారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో టిడిపిని మించిన వారు లేరని అన్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయానికి విద్యుత్ చార్జీలు తగ్గించాలని రైతులు ఆందోళన చేస్తే బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద రైతులపై కాల్పులు జరిపి హత్య చేశారని, ఇప్పుడు వాళ్లు రైతుల కోసం మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్న పార్టీ వారిని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ విశ్వసించరని కర్నే ప్రభాకర్ అన్నారు. టిడిపి నాయకులకు కేసిఆర్‌ను విమర్శించే నైతిక హక్కులేదని, టిఆర్‌ఎస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే ప్రభుత్వమని అన్నారు. చంద్రబాబు విద్యుత్ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేసినట్టు ప్రకటించినప్పుడు తెలంగాణ టిడిపి నాయకులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే కేసిఆర్ ఉన్నారని అన్నారు. ఒకవైపుఅభివృద్ధి కోసం కలిసి పని చేస్తాం అని బాబు చెబుతూనే మరోవైపు తెలంగాణలో తన అనుచరుల ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: