తెలుగుదేశం పార్టీని పదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి తీసుకురావటానికి తారకమంత్రంగా పనిచేసిన రైతాంగ రుణమాఫీ ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి కష్టసాధ్యంగా మారింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అనే్వషిస్తున్నారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంరోజే తొలి సంతకం చేసినప్పటికీ దీనికి సంబంధించిన మార్గదర్శకాలతో జీవో జారీలోనే అంతులేని జాప్యం జరిగింది. రుణాల రీ షెడ్యూలులో ఊగిసలాట జరుగుతున్నది. రుణమాఫీ కింద కనీసం 70వేల కోట్ల రూపాయలు పైగా ప్రభుత్వం భరించాల్సి ఉంటే ప్రస్తుత వార్షిక బడ్జెట్‌లో కేవలం ఐదు వేల కోట్ల రూపాయలనే కేటాయించడంతోనే పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే దీనికి సంబంధించి ప్రభుత్వం జారీచేసిన జీవో నెం. 174లో 2014 జనవరి నుంచి మార్చి మాసంలోపుగా రుణ బకాయి చెల్లించిన రైతులెవరికీ ఈ మాఫీ వర్తించదంటూ జిఒ స్పష్టం చేస్తోంది. వాస్తవానికి ఇప్పటివరకు ఈ జీవోలోని విధి విధానాలను ఎవరూ అంతగా పట్టించుకోలేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదేళ్లపాటు వ్యవసాయ మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు అందరికంటే ముందుగా స్పందించారు. రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం.. స్తోమతు ఉన్నవారు బకాయి చెల్లించినా మాఫీని వర్తింపచేస్తూ సంబంధిత సొమ్మును వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామంటూ ముఖ్యమంత్రి, మంత్రులు పదేపదే చెబుతూ వచ్చి తీరా జీవోలో ఈ పితలాటకం ఏమిటని వడ్డే ఆవేశంతో ప్రశ్నించారు.  ఈ విషయమై తాను ఇప్పటికే వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావుతో మాట్లాడటం జరిగిందన్నారు. 2013 డిసెంబర్‌లోపు రుణాలు తీసుకున్న వారికే వర్తించటం బాగానే ఉంది. చెల్లించినవారికి వర్తించకపోవటం ఏమిటంటూ పలువురు విస్తుపోతున్నారు. ప్రధానంగా చెరకు రైతుల్లో ఏ ఒక్కరికీ కూడా ఈ మాఫీ వర్తించదు. సాధారణంగా చెరకు రైతులు ఫ్యాక్టరీ యాజమాన్యాల మధ్య ముందుగానే జరిగిన ఒప్పందం ఆధారంగా రుణాలు ఇస్తాయి. చెరకు ఫ్యాక్టరీకి చేరిన మరుక్షణంలోనే రుణ బకాయి పూర్తిగా చెల్లించబడుతుంది. అలాగే అత్యధిక మంది రైతులు ఈ రుణమాఫీ జరిగేనో.. లేదోనన్న శంకతో నిర్ణీత కాలంలో బకాయి చెల్లిస్తే కనీసం వడ్డీ మాఫీ అయినా జరుగుతుందనే ఆశతో తమ తమ సొసైటీలో అప్పోసొప్పో చేసి బకాయిలు చెల్లించటం జరిగింది. ఇలాంటి వారెవరికీ మాఫీ వర్తించకుండా బోతున్నది. ఇదిలా ఉంటే 95 శాతం కౌలు, సన్నకారు రైతులెవరికీ కూడా అసలు రుణాలే దక్కటం లేదు. రైతులు తెలివిగా తమ కుటుంబ సభ్యులనే కౌలు రైతులుగా చూపి భారీఎత్తున రుణాలు పొంది ఎంచక్కా ఈ మాఫీ నుంచి లబ్ధిపొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: