అటల్ బిహారీ వాజ్ పేయి, లాల్ క్రిష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషీ. భారతీయ జనతా పార్టీని పునాధి స్థాయి నుంచి పెంచి అధికార పీఠం వరకూ నడిపిన అగ్ర నాయకులు ఈ ముగ్గురూ. పార్టీ వ్యవస్థాపక సభ్యులు కూడా అయిన ఈ ముగ్గురి శకమూ బీజేపీలో ముగిసిపోయింది. పార్టీ పాలనా పగ్గాలు పూర్తిగా ఈ ముగ్గురి తర్వాతి తరాల వారి చేతుల్లోకి వెళ్లాయి. గడిచిన నలభై ఏళ్లుగా అహోరాత్రులూ శ్రమించి, దేశమంతటా విస్తరింపజేసిన కమలం పార్టీ పార్లమెంటరీ బోర్డు నుంచి త్రిమూర్తులు ముగ్గురినీ తప్పించారు. బీజేపీలో అత్యున్నత నిర్ణాయక విభాగంగా చెప్పుకునే ఈ బోర్డు నుంచి వారి తొలగింపుతో పార్టీలో ఇక వాళ్ళ శకం ముగిసిందనడానికి సంకేతం. పార్లమెంటరీ బోర్డు నుంచి తొలగించిన త్రిమూర్తులను ఐదుగురు సభ్యుల మార్గదర్శక మండలిలో నియమిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. ఈ మండలిలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా ఉంటారు. వాజ్ పేయి, అద్వానీ, జోషీలను తప్పించి 12 మంది సభ్యులతో నూతన పార్లమెంటరీ బోర్డును ఏర్పాటు చేశారు. ఇందులోకి కొత్తగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌చౌహాన్, జేపీ నడ్డాను తీసుకున్నారు. బోర్డుపై పూర్తిగా ప్రధాని నరేంద్ర మోడీ ముద్ర కనిపించింది.ఇటీవలే బీజేపీ పగ్గాలు చేపట్టిన అమిత్‌షా.. ప్రధాని మోడీతో సంప్రదించి ఆయన సూచనల మేరకే కమిటీలను ఏర్పాటు చేశారు. పార్లమెంటరీ బోర్డుకు అధ్యక్షుడు అమిత్ షా ఛైర్మన్ కాగా, మిగతా సభ్యులుగా ప్రధాని మోడీతోపాటు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, అనంత్‌ కుమార్, తవార్‌ చంద్ గెహ్లాట్, శివరాజ్‌ చౌహాన్, జగత్‌ ప్రకాశ్‌ నడ్డా, రాంలాల్ ఉన్నారు. 75 ఏళ్లకు పైబడిన వారికి పార్టీ పదవులు ఇవ్వొద్దని నిర్ణయించడంతో అగ్రనేతలు వాజ్ పేయి, అద్వానీ, జోషికి బీజేపీ కమిటీల్లో చోటు కల్పించలేదని తెలుస్తోంది. గతేడాదే పార్టీ పార్లమెంటరీ బోర్డులోకి తన విధేయుడైన చౌహాన్‌ ను తీసుకోవాలని అద్వానీ పట్టుబట్టారు. అయితే అప్పుడు అందుకు మోడీ ఒప్పుకోలేదు. ఇప్పుడేమో అద్వానీని తప్పించి చౌహాన్‌ ను తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: