మూడు నెలల క్రితం దేశంలో ఎక్కడ చూసినా ఇదే జపం.. ఎన్నికల వేళ నరేంద్రమోడీ ప్రభంజనమే సృష్టించారు. ఒకప్పుడు పార్లమెంటులో కేవలం 2 సీట్లకే పరిమితమైన పార్టీని.. ఏకంగా మూడొందల స్కోరు దాటించి.. కమల నాధులు అసాధ్యమనుకున్న దాన్ని అవలీలగా సుసాధ్యం చేశారు. ఒక్కసారి కూడా పార్లమెంటులో అడుగుపెట్టకుండానే ఏకంగా ప్రధాని పదవిని అధిష్టించారు. నూట 20 కోట్ల భారతీయుల ఆశల ప్రతిరూపంగా మోడీ అధికారం చేపట్టారు. ఇటీవలే మోడీ సర్కారు పనితీరుపై సర్వే చేసిన ఓ సంస్థ.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే.. కమలం పార్టీకి మొన్నటి కంటే 30శాతం అదనంగా సీట్లొస్తాయని జోస్యం కూడా చెప్పింది. ఈ మోడీ ప్రభంజనం అంతలోనే ఆవిరవుతోందా.. మోడీపై జనానికి అప్పుడే మొహం మొత్తిందా.. తాజాగా ఈ సందేహాలు రాజకీయ విశ్లేషకులలో కలుగుతున్నాయి. తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో కమలం పార్టీ అనుకున్నంతగా ఫలితాలు రాబట్టలేకపోయింది. బీహార్, కర్ణాటక, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలో జరిగిన ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీయే ఆధిక్యత సాధించి కమలనాథులకు కంగారు పుట్టిస్తోంది. మొత్తం 18 స్థానాలకు ఎన్నికలు జరిగితే... కాంగ్రెస్-దాని మిత్రపక్షాలు 10 చోట్ల విజయం సాధించాయి. కమలం పార్టీ.. మిత్రపక్షమైన ఆకాదళ్ తో పాటు 8 స్థానాలు దక్కించుకున్నాయి. త్వరలో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఫలితాలు భాజపా నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ప్ర్తత్యకించి.. బీహార్ ఉపఎన్నికల్లో జేడీయూ, ఆర్జేజీ, కాంగ్రెస్ మహా కూటమి జయభేరి మోగించింది. మొత్తం 10 స్థానాల్లో ఆరింటిని గెలుచుకుని ఎన్డీఏ సర్కారుకు ప్రమాదఘంటింకలు మోగించింది. వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మోడీతో విబేధించిన ఎన్డీఏ నుంచి బయటికొచ్చిన నితీష్ కుమార్.. ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసం ఏకంగా బద్దశత్రువు లాలూతో కూడా చేతులు కలిపేందుకు వెనుకాడలేదు. తొలి 3 నెలల్లోనే మోడీ సర్కారు అన్ని ఛార్జీలు పెంచడం.. తమ కొంప ముంచిందని కమలనాథులు అంటున్నారు. లోక్ సభ ఎన్నికల ఘన విజయం తర్వాత తొలిసారిగా తగిలిన దెబ్బతో వారు ఆత్మరక్షణ ధోరణిలో పడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టబోయిన కాంగ్రెస్..ఈ ఫలితాలతో కాస్త ఊపిరిపీల్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: