అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన శివరామకృష్ణన్ తుది నివేదిక వచ్చేసింది. దాదాపు 11 జిల్లాలు తిరిగిన పెద్దాయన బృందం కేంద్రం అప్పగించిన పని పూర్తి చేసింది. రాజధాని ఎక్కడ పెట్టుకున్నా ఫరవాలేదు కానీ.. విజయవాడ- గుంటూరు ప్రాంతంలో మాత్రం పెట్టొద్దని తెగేసి చెప్పేసింది. అందుకు కారణాలూ వివరించింది. కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలు ప్రపంచంలోనే వరి పంటకు అనువైన వ్యవసాయ భూములున్నందువల్ల రాజధాని వస్తే.. ఆ భూములు వ్యాపార భూములవుతాయని హెచ్చరించింది. భవిష్యత్తులో ఏపీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పింది. మరోవైపు రాయలసీమవాసులు బెజవాడ-గుంటూరు ఆప్షన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. కర్నూలు లేదా అనంతపురం రాజధాని చేయాలని కోరుతున్నారు. ఆ రెండూ కానీ పక్షంలో మధ్యే మార్గంగా ప్రకాశం జిల్లాలోని ఏదైనా పట్టణాన్ని చేయాలని కోరుతున్నారు. దొనకొండ ప్రాంతంలో సర్కారు భూములు బాగా ఉన్నందువల్ల అక్కడైనా రాజధానిపెట్టాలంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం కూడా బెజవాడ-గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా వ్యతిరేకిస్తున్నారు. దొనకొండే బెటరని అసెంబ్లీలోనే తేల్చిచెప్పారు. ఇంతమంది చెబుతున్నా.. చంద్రబాబు మాత్రం ఆ విషయంలో మనసు మార్చుకోవడం లేదు. చంద్రబాబు మొండివైఖరికి కారణమేంటా అని విశ్లేషిస్తే.. ఇందుకు ప్రముఖంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. కృష్ణా-గుంటూరు బెల్ట్ పై కమ్మ సామాజిక వర్గ ప్రభావం చాలా ఎక్కువ. ఈ రెండు జిల్లాల్లో టీడీపీ బలం కూడా చాలా ఎక్కువ. రాజధాని ఐతే క్రమంగా జనాభా పెరుగతుంది. అందుకు అనుగుణంగా భవిష్యత్తులో అసెంబ్లీ, పార్లమెంటరీ సీట్లు కూడా పెరుగుతాయి. పార్జీ బలం, సామాజిక బలం రెండూ తోడైతే.. భవిష్యత్తులో పార్టీకి తిరుగుండదని ఆయన భావిస్తున్నారు. బెజవాడ-గుంటూరు ప్రాంతంలోని భూములు కూడా ఎక్కువగా ఆ సామాజిక వర్గం చేతులోనే ఉండటం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం బలంగా కాస్తో కూస్తో బలంగా ఉన్న రాయలసీమలో పెడితే రాజకీయంగానూ, సామాజిక వర్గపరంగానూ టీడీపీ ఇబ్బందిపడవచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఎవరేమన్నా.. ఎన్ని చెప్పినా.. బెజవాడ-గుంటూరు ప్రాంతాన్నే రాజధాని చేయాలని డిసైడైపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: