నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిని ఎక్కడ నిర్మించాలన్న తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకుల విచక్షణకు వదిలిపెట్టడం ద్వారా, కె. శివరామకృష్ణన్ అధ్యయన సంఘంవారు వివాదరహితమైన నివేదికను సమర్పించినట్టయింది. తాము వివిధ ప్రతిపాదనలను విశే్లషిస్తామని, ‘‘ఏదో ఒక ప్రదేశంలో రాజధానిని నిర్మించాలని’’ సూచించబోమని రాష్టమ్రంతటా పర్యటనలు సాగించిన సందర్భంగా సంఘంవారు ప్రకటిస్తూనే వచ్చారు. అందువల్ల రాజధానిని ఎక్కడ నిర్మించాలన్న విషయం నివేదికలో కచ్చితంగా నిర్ధారణ కాకపోవడం ఆశ్చర్యకరం కాదు. కేంద్ర ప్రభుత్వం కాని, రాష్ట్ర ప్రభుత్వాలు కాని ఏర్పాటు చేసే సంఘాలు, విచారణ బృందాలు, అధ్యయన సమితులు సమర్పించే ప్రతి నివేదిక కేవలం ‘సిఫార్సు’ మాత్రమే. ఆయా నివేదికలను ప్రభుత్వాలు అంగీకరించవచ్చు లేదా నిరాకరించవచ్చు. ఇది రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కనుక తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకులది. అందువల్ల తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని శివరామకృష్ణన్ సంఘంవారు చెప్పి ఉండనక్కరలేదు. చెప్పడం రాజ్యాంగ వ్యవస్థలోని ఒక కార్యాచరణ వాస్తవాన్ని పునరుద్ఘాటించడం మాత్రమే. కానీ ఈ లాంఛనప్రాయమైన స్పష్టీరణ ద్వారా ‘‘మేము మా అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై కాని, రాష్ట్ర ప్రజలపై కాని రుద్దడం లేదు’’ అని అధ్యయన సంఘం వారు తెలివిగా ధ్వనింపజేశారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి చతురస్ర క్షేత్రంలో రాజధానిని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించుకొందన్న ప్రచారం ఊపందుకున్న తరుణంలో మరో ప్రదేశాన్ని నిర్దిష్టంగా సూచించడానికి సంఘం వారు సిద్ధంగా లేరన్నది కూడ నివేదిక ద్వారా వెల్లడైన అంశం. వచ్చే గాంధీ జయంతి నుండి విజయవాడ తాత్కాలిక రాజధానిగా పరిపాలన యంత్రాంగాన్ని వ్యవస్థీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తవౌతున్న నేపథ్యంలో భిన్న స్వరాన్ని వినిపించడం అభిలషణీయం కాదని కూడ సంఘంవారు భావించి ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తన అభీష్టాన్ని గతంలో సంఘం వారికి పరోక్షంగా స్పష్టం చేసింది కూడ. అందువల్ల విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి- చతురస్ర ప్రాంతంలోనే అవశేష ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పడాలని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే దృఢ నిశ్చయానికి వచ్చి ఉండవచ్చు. అందువల్ల శివరామకృష్ణన్ సంఘంవారి ‘వినుకొండ-దొనకొండ’ ప్రతిపాదన వీగిపోవడానికే అవకాశం ఎక్కువ ఉంది. ఒకవేళ వినుకొండ-దొనకొండ మధ్య ప్రాంతంలో రాజధానిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టయితే అది మరో అద్భుతం కాగలదు. అద్భుతం జరగరాదన్న నియమం కూడ లేదు. రాజధాని ప్రాంతం మహానగరానికి, ప్రధాన జాతీయ రహదారికి, రైలు మార్గానికి సమీపంలో ఉండాలని, భావిస్తున్నందువల్లనే విజయవాడ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా అభిలషిస్తోంది. వినుకొండ-దొనకొండ వంటి ప్రాంతాలు, కర్నూలు-గుంటూరు రైలు మార్గానికి, రహదారికి అతి సమీపంలో ఉన్నప్పటికీ విజయవాడ-గుంటూరు ప్రాంతం వలె ఆర్భాటాలు, ఆధునికమైన హంగులూ వాటికి లేవు. చడీ చప్పుడు లేని వినుకొండ ప్రాంతంలో రాజధాని ఉంటే ఏం బాగుంటుందన్న భావమే రాష్ట్ర ప్రభుత్వ వైముఖ్యానికి కారణం కావచ్చు. లేదా రాష్ట్ర ప్రభుత్వం కూడ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందేమో? శివరామకృష్ణన్ కమిటీ వారి విశే్లషణల లోని ఔచిత్యాన్ని పాటించి మాత్రమే వినుకొండ-దొనకొండ ప్రాంతాన్ని రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసినట్టు ప్రకటించడం ద్వారా నొప్పింపక తానొవ్వక అన్న నీతిని అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగాన్ని సిద్ధం చేస్తున్నారేమో? ప్రధానంగా రెండే ప్రత్యామ్నాయాలు ప్రచారమయ్యాయి. విజయవాడ-గుంటూరు పరిసరాలకు,వినుకొండ-దొనకొండ పరిసరాలకు మధ్యనే పోటీ కేంద్రీకృతమైపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడివడి అవశేషాంధ్రప్రదేశ్ ఏర్పడిన తొలి రోజులలో తిరుపతి, కర్నూలు, అమరావతి, కాకినాడ, విశాఖపట్టణం, వంటి పేర్లన్నీ రాజధానిగా చర్చకు వచ్చినప్పటికీ క్రమంగా దొనకొడ, గుంటూరు మాత్రమే రంగంలో మిగిలాయి. అందువల్ల గుంటూరును కాని వినుకొండను కాని నొప్పించని రీతిలో ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండవచ్చు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు పరిసరాలలోనే రాజధానిని ఏర్పాటు చేయతలపెట్టింది. కానీ నిపుణుల మాట మన్నించి దొనకొండ ప్రాంతాన్ని ఎంపిక చేశాం..’’ అన్న వ్యూహాన్ని ముఖ్యమంత్రి అమలు చేయనున్నారేమో? ఇప్పటికే నగరాలు, పట్టణాలతో నిండివున్న విజయవాడ ప్రాంతంలో రాజధానిని నెలకొల్పితే వేలాది చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో వాతావరణ సహజ సౌందర్యం అంతరించిపోయే ప్రమాదం ఉందన్న సంఘం వారి సూచనను రాష్ట్ర ప్రభుత్వం పరిగణించకుండా ఉండజాలదు. పరిగణించి ఉన్నట్టయితే క్రమంగా వేలాది ఎకరాల వ్యవసాయ భూమిని, రాష్ట్రంలోనే అత్యంత సారవంతమైన ‘కాశ్మీర్ ఖండం’ వంటి భూమిని కాంక్రీట్ కట్టడాల కోసం వినియోగించజాలదు. గుంటూరు, మంగళగిరి మధ్య రాజధానిని నిర్మించడంపట్ల రాజకీయవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, ఇళ్ల సముదాయాలను నిర్మించే వ్యాపార వేత్తలు, దళారీలు మాత్ర మే ఉత్సాహం చూపుతున్నారన్న ప్రచారం కూడ ఓవైపున జరుగుతూనే ఉంది. పొలాల యజమానులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, సామాన్య ప్రజలు మాత్రం ఆకుపచ్చని ప్రాంతాలు పాడుపడిపోతాయన్న ఆందోళనకు గురి అవుతున్నారట. తమ పొలాలను రాజధాని నిర్మాణం కోసం అప్పగించి నిర్వాసితులు కావడానికి కృష్ణా డెల్టా ప్రాంతంవారు సిద్ధంగా లేరు. గుంటూరు-విజయవాడ ప్రాంతంలో రాజధానిని నిర్మించాలంటే కేవలం భూమి సేకరణ కోసమే నలబయివేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందన్నది శివరామకృష్ణన్ సంఘం వారు గత నెలలోనే స్పష్టం చేసి ఉన్నారు. ఈ కోణంలో పరిశీలిస్తేవినుకొండ-దొనకొండ ప్రాంతమే భూసేకరణకు అత్యంత అనువైన ప్రదేశమన్నది సంఘం వారి అభిప్రాయం. వినుకొండ-దొనకొండ ప్రాంతం పడమటి కనుమల శ్రేణిలో ఉన్నాయి కాబట్టి రాజధాని నిర్మాణం జరిగిన తరువాత కూడ పరిసరాలలో తగినంత పచ్చదనం మిగిలి ఉంటుంది. గుంటూరు, విజయవాడ ప్రాంతం ఇప్పటికే తగినంత అభివృద్ధి చెంది ఉంది. అందువల్ల రాజధాని ఏర్పాటుకావడం వల్ల ఇక జరగబోయేది కాలుష్యం అభివృద్ధి, జనసమ్మర్ధం, పెరగడం మాత్రమే. గ్రామీణ క్షేత్రమైన వినుకొండ ప్రాంతంలో రాజధాని ఏర్పడితే కొత్తగా మరో ప్రగతి కేంద్రాన్ని నెలకొల్పినట్టు కాగలదు.. ఏది ఏమైనా మెట్రోపాలిటన్ సిటీగా కాక ప్రశాంత పరిసరాలున్న పరిపాలనా కేంద్రంగా మాత్రమే రాజధాని ఉండాలన్నది పెరుగుతున్న జనాభిప్రాయం. అందువల్ల దొనకొండ వద్ద అయినా మంగళగిరి వద్ద అయినా రాజధాని వాణిజ్య పారిశ్రామిక విన్యాసాలు లేని పాలనా వాటికగా చిన్న పట్టణంగా ఉండడం మేలు..

మరింత సమాచారం తెలుసుకోండి: