ప్రపంచం రోజురోజుకూ కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. పల్లెలు క్రమంగా పట్టణీకరణను సంతరించుకుంటున్నాయి. వ్యక్తిగత జీవితాల్లోకి కూడా మొబైల్, కంప్యూటర్, ఇంటర్నెట్ సాయంతో ఆధునికత దూసుకొస్తోంది. మరి ఇలాంటి రోజుల్లోనూ ఇంకా అటవీయుగం నాటి పరిస్థితులు ఉన్నాయా.. అంటే నమ్మడం కష్టమే కానీ.. కేవలం అడవుల్లోనే ఉంటే.. అరణ్యమే లోకంగా దుర్భర జీవితం గడిపే మన సోదరులు మనకు కేవలం వందల కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు. వారే చెంచులు వంటి అడవిజాతులు. కీకారణ్యం తప్ప పట్టణవాసం ఎలా ఉంటుందో తెలియని కొన్ని కుటుంబాలకు తెలంగాణ స్పీకర్ కొత్తలోకాన్ని చూపించారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని రెండు అటవీగ్రామాల్లోని 73 చెంచు కుటుంబాలకు ఆయన పట్టణాన్ని పరిచయం చేశారు. వారి వద్దకు వెళ్లి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి.. ఒక రోజంతా వారితో గడిపారు. వారికి వరంగల్ నగరమంతా తిప్పి చూపించారు. కాకతీయుల కోట, భద్రకాళి దేవాలయం, వేయి స్థంభాల గుడి వంటి ఆద్యాత్మిక ప్రాంతాలు చూపారు. అంతే కాదు.. కలెక్టర్ కార్యాలయం వంటి ఆధునిక పరిపాలన కేంద్రాలనూ చూపారు. మీ పిల్లలను పెద్ద చదువులు చదివిస్తే.. ఇలాంటి బంగ్లాల్లో అధికారులవుతారని వివరించారు. అంతే కాదు.. ఆ గిరిజన కుటుంబాలకు సాయంత్రం ప్రత్యేకంగా టీ పార్టీ ఇచ్చారు. కలెక్టర్ వంటి ఉన్నతాధికారుల సమక్షంలో 73 కుటుంబాలు తేనీటి విందును ఆస్వాదించాయి. అంతటితో ఆగలేదు. రాత్రికి వరంగల్లోని ఓ థియేటర్ లో శ్రీరామరాజ్యం సినిమా చూపించారు. ఇదంతా వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే చేశానంటున్నారు తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి. సమైక్యాంధ్రప్రదేశ్ లో కూడా అప్పటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఏకంగా ఏజెన్సీ ప్రాంతాలకే వెళ్లి రెండు, మూడు రోజులు వారితో గడిపారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా అవసరం. ప్రశంసనీయం.

మరింత సమాచారం తెలుసుకోండి: