సినిమా నటీమణులు వ్యభిచారం చేస్తూ పట్టుబడుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువై పోతున్నాయి. అన్ని భాషల నటీమణులు, దేశవ్యాప్తంగా చిక్కుతూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో ఒక్క హైదరాబాద్లోనే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా దొరుకుతున్నారు. ఈ సంఘటనలు ఇలాగే కొనసాగితే సమాజంపై చెడుప్రభావం చూపే ప్రమాదం ఉంది. అవకాశాలు తగ్గిపోయిన సినిమా నటీమణులు వ్యభిచార కూపంలోకి ఎందుకు దిగుతున్నారు? ఆర్థిక పరిస్థితులు కారణమా? విలాసాలకు అలవాటుపడటమా? వీరిని ఎవరైనా ప్రేరేపిస్తున్నారా? మానసిక దౌర్భల్యమా? నైతిక విలువలు లేకనా? తేలికగా డబ్బు సంపాదించవచ్చని అనుకోవడమా? ఇదొక ప్రధాన సామాజిక సమస్య అయినందున అన్ని కోణాలలో దీని గురించి ఆలోచన చేయవలసి ఉంది. మన దేశంలో వ్యభిచారం చట్టవ్యతిరేకం అని తెలిసి కూడా ఇంత మంది ప్రముఖులు ఈ వృత్తిలోకి ఎందుకు దిగుతున్నారో సామాజిక శాస్త్రవేత్తలతోపాటు మేథావులు, ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అవకాశాలు తగ్గిపోతే బతకడానికి మరో మార్గంలేదా? ఈ వృత్తిలోకే దిగాలా? విలువలకు కట్టుబడి చట్టబద్దమైన మార్గంలో అనేక పనులు చేసుకొని బతకవచ్చు. ఆ మార్గాలను ఎందుకు ఆలోచించరు? పండు ముసలివాళ్లు కూడా బుట్టలో పల్లీలు అమ్ముతూ బతుకుతున్నారు. కూలి పని చేసుకొని బతుకుతున్నారు. శరీరంలో శక్తి, మెదడులో ఆలోచనలు, సెలబ్రిటీగా పలువురితో పరిచయాలు ఉండి కూడా ఇటువంటి చట్టవ్యతిరేకమైన వ్యభిచార వృత్తిలోకి దిగడం ఎందుకు? అని ఆలోచన చేయరా? బతకడానికి ఇతర చట్టబద్దమైన మార్గాలను ఎందుకు ఎన్నుకోరు? సాధారణంగా ఇటువంటి సందర్భాలలో పట్టుబడిన ఆ నటీమణులపై కొందరు జాలి చూపుతారు. ఇంత చిన్న నేరానికే ఇంత ప్రచారమా? అని అంటుంటారు. మరి కొందరు తిట్టిపోస్తారు. బతకడానికి ఈ పనే దొరికిందా? అని ప్రశ్నిస్తుంటారు. మరికొందరు ఆ విటుల గురించి ప్రశ్నిస్తుంటారు. నటీమణులు గానీ, ఇతర యువతులు గానీ వ్యభిచార కూపంలోకి దిగడానికి ప్రధానంగా ఆర్థిక పరిస్థితులతోపాటు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడటం, నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వడం, మానసిక దౌర్భల్యం ...ఇవన్నీ ప్రధాన కారణాలుగా భావించవచ్చు. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక శాస్త్రవేత్తలు, ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది. వారికి ఉపాధి అవకాశాలు మెరుగు పరచడం, నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వకుండా, మానసిక స్థితి దిగజారకుండా వారికి కౌన్సిలింగ్ ఇప్పించవలసి ఉంది. మహిళా సంక్షేమ శాఖ ద్వారా ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక పథకాలను రూపొందించవలసిన అవరసం ఉంది. ఇటువంటి సంఘటనలు అధికమవుతూ ఉంటే సమాజాం మీద చెడు ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందువల్ల వ్యభిచారం ఎక్కువగా జరిగే ప్రాంతాలలో చాలా పెద్ద ఎత్తున విస్తృత స్థాయిలో కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది.Source

మరింత సమాచారం తెలుసుకోండి: