చేపలవానితో స్నేహం కంటే అత్తరు వానితో కయ్యం మేలని సామెత. అత్తరు వాడితో గొడవపెట్టుకుని వాడి చేతిలో నాలుగు తన్నులు తిన్నా.. వాడి సువాసన మనకు అంటుతుందన్నది ఈ సామెత పరమార్థం. ఆర్థిక నేరగాడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ తీరు పరిశీలిస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. జగన్ అక్రమాస్తుల కేసులో వివిధ రంగాలకు చెందిన ఎందరో చిక్కుకున్నారు. ప్రజల బాగు కోసం అహర్నిశలు శ్రమించే ఐ ఏఎస్ లు, నిమ్మగడ్డ వంటి వ్యాపార దిగ్గజాలు.. ఇలా ఎందరో జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. మరికొందరు సీబీఐ ఆరోపణలతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. జగన్ ఆర్థిక నేరాలకు అండగా నిలిచారన్నదే వారిపై ప్రధానంగా కనిపిస్తున్న ఆరోపణ. నేరం చేయడం ఎంత తప్పో.. ఆ నేరానికి సహకరించడమూ అంతే తప్పు. జగన్ అక్రమాస్తుల కేసులో తాజాగా మరో వీఐపీ చేరాడు. దేశంలోని అగ్రశ్రేణి నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఎంబసీ గ్రూపు ఛైర్మన్ జితేంద్ర వీర్వాణీ మోహన్ దాస్ ఈ కేసులో నిందితుల జాబితాలో ఉన్నాడు. ఈయన ఫోర్స్స్ బిలియనీర్ల జాబితాలో పేరు సంపాదించిన వ్యక్తి కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఆయన ర్యాంకు 1499. ఆయన ఆదాయం ఎంతో తెలుసా.. ఆరు లక్షల 70 వేల కోట్ల రూపాయలు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని నీకది-నాకది పద్దతిలో వేల కోట్లుకూడబెట్టుకోవడానికి జగన్, ఇందూ శ్యాంప్రసాదరెడ్డి కలసి ఆడిన నాటకంలో ఈ జితేంద్ర వీర్వాణీ కూడా బలిపశువుగా మారాడని సీబీఐ చెబుతోంది. ప్రభుత్వం నుంచి ప్రాజెక్టు దక్కించుకోవడానికి తగిన అర్హతలు ఇందూకు లేకపోవడం వల్ల... అన్ని అర్హతలు ఉన్న ఎంబసీ గ్రూపుపై శ్యాంప్రసాద్ రెడ్డి కన్ను పడిందని సీబీఐ చెబుతోంది. ఆ గ్రూపుతో కలసి ఇందూ కన్సార్టియం ఏర్పాటు చేసి... ప్రభుత్వం నుంచి అప్పనంగా భూములు పొందారట. ప్రభుత్వంతో ఒప్పందం కుదిరాక.. కన్సార్టియం నుంచి ఎంబసీ గ్రూపు తప్పుకోవడం కూడా ముందస్తు వ్యూహంలో భాగమేనని సీబీఐ చెబుతోంది. ఆ సహాయానికి ఎంబసీ గ్రూపుకు భారీగానే సొమ్ములు ముట్టాయని చెబుతోంది. మొత్తానికి జగన్ పుణ్యమా అని.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన వ్యక్తులు కూడా నేరగాళ్ల జాబితాలో చోటు సంపాదిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: