ఏపీలో రాజకీయాలు రోజురోజుకు రంజుగా మారుతున్నాయి. ఎన్నికల్లో పరాభవం పొంది ప్రతిపక్షనేత స్థానానికి పరిమితమైన వైఎస్ జగన్ ను మరింతగా తొక్కేసేందుకు టీడీపీ నేతలు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే జగన్ అక్రమాస్తుల కేసులను బాగానే వాడుకుంటున్నారు. ఆర్థిక నేరగాడంటూ ప్రచారం ఉధృతం చేశారు. దీనికి తోడు.. పరిటాల హత్యకేసు అంశాన్ని మరోసారి తెరపైకి తెస్తున్నారు. ఇటీవల సాక్షాత్తూ పరిటాల రవి భార్య, పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పరిటాల హత్య కేసును రీ ఓపెన్ చేస్తే.. తొలి ముద్దాయి జగనే అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రిగారు చెప్పినట్టు అదే జరిగితే రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయం. ఇప్పటికే ఓవైపు అక్రమాస్తుల కేసులు జగన్ ను వెంటాడుతున్నాయి. ఇప్పుడీ కేసు కూడా తోడైతే.. ఆర్థిక నేరగాడు గానే కాకుండా హత్యారాజకీయాల్లోనూ జగన్ హస్తం ఉందన్న చెడ్డపేరు రావడం ఖాయం. ఈ ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ కూడా దీటుగానే రెడీ అవుతోంది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న కోణంలో ఆలోచిస్తోంది. టీడీపీ హత్యారాజకీయాలపై ఫోకస్ చేయడంతో వైకాపా కూడా అదే అంశాన్ని బయటకు తీస్తోంది. వంగవీటి మోహన రంగా హత్య కేసు అంశాన్ని మరోసారి వెలుగులోకి తెస్తూ.. పరిటాల కేసు రీ ఓపెన్ చేస్తే.. ఆ కేసు కూడా రీఓపెన్ చేయాలని నిలదీస్తోంది. ప్రస్తుతం ఈ రెండు కేసులు క్లోజ్ చేశారని రెండింటిలోనూ నిందితులు నిర్దోషులుగా బయటకు వచ్చారని జగన్ పార్టీ చెబుతోంది. రంగా కేసు రీ ఓపెన్ చేస్తే చంద్రబాబే మొదటి ముద్దాయి అవుతాడని జగన్ పార్టీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: