విభజన మీకు, మాకే కాదు.. ఎవరికీ మంచిది కాదు.. అంటూ స్కాట్ లాండ్ ప్రజలకు హితబోధ చేస్తున్నాడు బ్రిటన్ ప్రధానమంత్రి కామెరన్. స్కాట్ లాండ్ లో స్వతంత్ర కాంక్ష పెరిగిపోతుండటంతో ఇప్పుడు కామెరన్ స్వయంగా రంగంలోకి దిగాడు. గ్రేట్ బ్రిటన్ నుంచి విడిపోవద్దని స్కాట్ లాండ్ ప్రజానీకాన్ని ఆయన కోరాడు. త్వరలో జరగనున్న రెఫరెండంలో బ్రిటన్ తో కలిసి ఉండటానికి అనుకూలంగానే ఓటేయాలని ఆయన కోరుతున్నాడు. విభజన వాదుల సంఖ్య పెరిగిపోయిందని విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధానమంత్రి స్వయంగా రంగంలోకి దిగాడు. 307 సంవత్సరాలుగా బ్రిటన్ తో కలిసి గ్రేట్ బ్రిటన్ లో భాగంగా సహగమిస్తున్న స్కాట్ లాండ్ ఇప్పుడు సొంతంగా మనుగడ సాగించడం పై ఆసక్తిని చూపుతోంది. తమకు స్వతంత్రం కావాలని స్కాట్ లాండ్ ప్రజలు అంటున్నారు. ఫలితంగా ప్రజాస్వామ్యయుత పద్ధతిలో రెఫరెండం జరగనుంది. ఈ రెఫరెండంలో విభజనకు అనుకూలంగా ఎక్కువమంది ఓటేస్తే... ఇంగ్లండ్ స్కాట్ లాండ్ కు స్వతంత్రం ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఈ విభజన వల్ల బలహీనపడతామని కామెరన్ అంటున్నాడు. ఇది ఇంగ్లండ్ కు గానీ, స్కాట్ లాండ్ కు గానీ ఏ మాత్రం మంచిది కాదని... ఆయన అభిప్రాయపడుతున్నాడు. దయచేసి అందరూ కలిసి ఉండటానికి అనుకూలంగా ఓటేయాలని స్కాట్ లాండ్ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు. 16 యేళ్ల వయసు పై బడ్డ ప్రతి స్కాట్ లాండ్ పౌరుడూ ఈ రెఫరెండంలో పాలు పంచుకోనున్నాడు. ఓటు ద్వారా తన అభిప్రాయాన్ని తెలపనున్నాడు. మరి బ్రిటన్ కు అయితే స్కాట్ లాండ్ కు స్వతంత్రం ఇవ్వడం పెద్దగా ఇష్టం లేదు. ఈ విషయంలో ఎలిజబెత్ రాణితో సహా అందరూ ఆందోళన చెందుతున్నారు. విభజనకు నో చెప్పమని స్వయంగా బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కోరడం ఆ ఆందోళన తీవ్రతను చాటి చెబుతోంది. మరి స్కాటిష్ ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో!

మరింత సమాచారం తెలుసుకోండి: