విజయవాడ చుట్టుపక్కలే రాజధాని అని ప్రకటించేయడంతో ఆ పరిసరాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆర్టీసీ బస్సు కూడా రాని ప్రాంతాల్లో ఆడి కార్లు సందడి చేస్తున్నాయి. రియల్టర్ల జోరు పెరిగింది. భూముల రేట్లు రోజు రోజుకు మారిపోతున్నాయి. మరి అలాంటి సమయంలో రాజధాని కోసం ప్రభుత్వం భూములు ఎలా సేకరిస్తుంది. సర్కారు రేట్లకు భూములు ఇచ్చేందుకు ఏ రైతులు ముందుకొస్తారు.. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ సర్కారు నడుంబిగించింది. ఇప్పటికే 60-40 నిష్పత్తిలో భూమిని డెవలప్ చేసి ఇచ్చేలా రైతుల నుంచి భూములు సేకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రతిపాదన పట్ల కొందరు సానుకూలంగా స్పందించినా.. ఆశించినంతగా స్పందన రాలేదు. ఆ కొద్ది మంది ముందుకొస్తే సరిపోదు. ఇలాంటిప్పుడు మరి ఏం చేయాలి.. ఈ విషయంపై కసరత్తు చేసిన ఏపీ సర్కారు.. రైతులపై మాయాస్త్రం సంధించబోతోంది. కొత్తవ్యూహం ప్రకారం ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ భవనాలు నిర్మిస్తారో ముందే... ప్రకటిస్తారు. కేవలం ప్రకటించడమే కాదు.. ఆయా భవనాల నమూనాలను.. ఆ భవనాలు పూర్తయితే పరిసర ప్రాంతాలు ఎలా మారిపోతాయే తెలిపేలా బ్రోచర్లు రెడీ చేయిస్తారట. రైతులు ఆయా బ్రోచర్లు చూసి అడ్డంగా ఫ్లాట్ అవుతారని.. అందులో తమకూ భాగం ఉంటే చాలని పరితపిస్తారని ఏపీ ప్రభుత్వం ఎక్స్ పెక్ట్ చేస్తోంది. ఈ మాయజాలం టెక్నిక్ కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందని భావిస్తున్న అధికారులు.. ఒకవేళ దీనికి కూడా రైతులు స్పందించకపోతే మరికొన్ని మార్గాలు సిద్దం చేసుకోవాలని భావిస్తోంది. అందరకీ ఒకే మంత్రంలా కాకుండా భూముల లొకేషన్, పరిమాణం వంటి అంశాలను బట్టి కూడా రైతులకిచ్చే డెవలప్ మెంట్ భూమి నిష్పత్తులు మారిపోతాయట. మరి ఈ కొత్త మంత్రం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి. ఎంత మాయాజాలం చేసినా.. రైతులు మరీ అంత అమాయకులేం కాదు. మరి వారు ఎలా స్పందిస్తారో..?

మరింత సమాచారం తెలుసుకోండి: