పాత్రికేయులను కిరాతకంగా హతమార్చడాన్ని తన లక్ష్యాల్లో ఒకటిగా మలుచుకున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు మరో దారుణానికి సిద్ధమైంది. ఓ ఇరాకీ వీడియో జర్నలిస్టును కిడ్నాప్ చేసిన ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు అతడిని సైతం చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. తమకు అనుకూలంగా వ్యవహరించకపోతే, ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు 'రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్' (ఆర్ఎస్ఎఫ్) మీడియా సంస్థ వివరాలు వెల్లడించింది. రాద్ మహ్మద్ అల్-అజ్జావి అనే వీడియో జర్నలిస్టు సెప్టెంబర్ 7న సమర్రా నుంచి అపహరణకు గురయ్యాడని ఆర్ఎస్ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది.  "ఆ జర్నలిస్టు ఇస్లామిక్ స్టేట్ కు అనుకూలంగా వ్యవహరించేందుకు అంగీకరించలేదని, అతడిని చంపుతామని జిహాదీలు బెదిరిస్తున్నారు" అని ఆర్ఎస్ఎఫ్ పేర్కొంది. ఐఎస్ఐఎస్ కొన్ని వారాల క్రితం జేమ్స్ ఫోలీ, స్టీవెన్ సాట్లాఫ్ అనే అమెరికా పాత్రికేయులను అత్యంత హేయమైన రీతిలో గొంతు కోసి చంపడం తెలిసిందే. దీనిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. అమెరికా కూడా ఈ ఘటనలను సీరియస్ గా పరిగణించి, సిరియాలో ఉన్న ఐఎస్ఐఎస్ మిలిటెంట్ స్థావరాలపై వైమానిక దాడులకు వ్యూహరచన చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: