రాష్ట్రంలో ఏర్పాటుచేయనున్న అన్న క్యాంటీన్ల నిర్వహణను ఇస్కాన్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు పౌర సరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. అనంతపురం నగరంలో శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా నిరుపేదలకు అతి తక్కువ ధరకే మూడు పూటలా భోజనం అందించాలన్న లక్ష్యంతో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. రాష్ట్రంలో తొలి విడతగా 35 క్యాంటీన్లు ఏర్పాటుచేయనున్నామన్నారు. స్వచ్చంద సంస్థలు ముందుకువస్తే క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలు వారికి సైతం అప్పగిస్తామన్నారు. తమిళనాడులో నిర్వహిస్తున్న అమ్మ క్యాంటీన్లను పరిశీలించామని, వాటి నిర్వహణ బాగుందన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి హోదాలోపేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలుచేశారన్నారు. అందుకే ఆయన పేర అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రంలోని అనంతపురంలో ఐదు, తిరుపతిలో ఐదు, గుంటూరులో పది, విశాఖపట్నంలో 15 మొత్తం 35 క్యాంటీన్లు ఏర్పాటుచేయనున్నామన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్న అన్న క్యాంటీన్లను ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ నిర్వహిస్తామన్నారు. ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, చెట్నీ, రాగిముద్ద, నీళ్ల పప్పు, మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకూ భోజనంలో సాంబారు అన్నం, పులిహోర, పెరుగు అన్నం, రాత్రి ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ భోజనంలో రెండు చపాతీలు, కూరగాయల కూర, పప్పు అందిస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: