ఓ అమ్మాయి వల్లో పడి.. దేశ రక్షణ రహస్యాలను పాకిస్తాన్ కు చేరవేసిన పతన్ ఉదంతం మరచిపోకముందే మరో దేశ ద్రోహం వెలుగులోకి వచ్చింది. ఈసారి పట్టుబడింది ఓ శ్రీలంక జాతీయుడు కావడం విశేషం. అరుణ్ సెల్వరాజ్ అనే ఈ ద్రోహి.. ఈవెంట్ మేనేజర్ ముసుగులో ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్లేవాడు. అక్కడి అధికారులతో పరిచయాలు పెంచుకుని గూఢచర్యం చేసేవాడు. ఆ వివరాలన్నీ పాకిస్తాన్ అధికారులకు ఈమెయిళ్ల ద్వారా పంపేవాడు. సెల్వరాజ్ సాయంతో పాకిస్తాన్ నాగుపాము ఐఎస్ఐ దక్షిణ భారతదేశంలో పెద్ద ఎత్తున విధ్వంసానికి కుట్రపన్నిందని తెలుస్తోంది. భారత దేశ రక్షణ రహస్యాలపై కన్నేసిన సెల్వరాజ్ పక్కా ప్లానింగ్ తో వ్యవహరించాడని పోలీసుల దర్యాప్తులో తెలుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా.. కొన్ని సంస్థలను ఏర్పాటు చేసి... వాటిని పక్కాగా నడుపుతూ.. వాటి నిర్వహణ ముసుగులో గూడఛర్యం చక్కబెట్టేవాడు. సెల్వరాజ్ ప్రధానంగా తమిళనాడులోని అణు విద్యుత్ కేంద్రం కల్పక్కాన్ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. కల్పక్కం వెళ్లి అక్కిడి సిబ్బంది, అధికారులతోనూ మాట్లాడి ఆ సమాచారాన్ని పాక్ పంపినట్టు వెల్లడైంది. కల్పక్కం సముద్రతీరంలో ఉండటం వల్లే ఉగ్రవాదుల కన్ను దీనిపై పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కల్పక్కంతో పాటు చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయం, చెన్నై విమానాశ్రయంలతో పాటు ఇతర ప్రాంతాల ఫోటోలు కూడా సెల్వరాజ్ ఐఎస్ ఐకు పంపినట్టు తెలుస్తోంది. మరో భయంకరమైన విషయం ఏంటంటే.. ఈ సెల్వరాజ్ మన హైదరాబాద్, విశాఖల్లోనూ తిరిగాడట.. భాగ్యనగరంలో ఎక్కడెక్కడ తిరిగాడు.. అనే విషయాలను ఎన్.ఐ.ఏ. అధికారులు రాబడుతున్నారు. శ్రీలంకకు చెందిన సెల్వరాజ్ పదోతరగతి వరకూ మాత్రమే చదివాడట. అక్కడ ఓ వ్యాపారంలో దెబ్బతిని బతుకుదెరువు కోసం చెన్నై వచ్చాడట. అక్కడ ఓ ఆటో డ్రైవర్ ప్రభావంతో తీవ్రవాద కార్యకలాపాల వైపు మొగ్గాడు. మొన్నపతన్... నేడు సెల్వరాజ్.. ఈ వ్యవహారాలు చూస్తుంటే ఐ.ఎస్.ఐ. పెద్ద ప్లాన్ తోనే ఉన్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: