తిరుపతిలోజరిగిన 14వ ఆర్థిక సంఘం సమావేశాల్లో చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏకరువు పెట్టారు. విభజన ద్వారా జరిగిన అన్యాయాన్ని వివరించారు. 1953 నుంచి మొదలుపెట్టి.. నేటి వరకూ జరిగిన పరిణామాల గురించి సంఘం సభ్యులు బిత్తరపోయేలా సుదీర్ఘ ప్రసంగం చేశారు. చంద్రబాబు ఉపన్యాసాన్ని వైఎస్సార్ పార్టీ తీవ్రంగా తప్పబడుతోంది. ఆర్థిక సంఘం ముందు చెప్పాల్సినవి చెప్పకుండా.. అనవరస విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని విమర్శిస్తోంది. ఈ మధ్య చంద్రబాబు ప్రసంగాలన్నీ వేదికలతో సంబంధం లేకుండా ఒకేలా ఉంటున్నాయని.. ఆ మాత్రం జాగ్రత్త తీసుకుకోండా ముఖ్యమంత్రి నిర్లక్యం వహించారని మండిపడుతోంది. ఆర్థిక సంఘం ముందు రాష్ట్రప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా.. అక్కడ కూడా రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్ పార్టీ అధికార ప్రతినిథి తమ్మినేని సీతారామ్ మండిపడ్డారు. చంద్రబాబు తనకు ఏం కావాలో చెప్పకుండా...పాత ప్రభుత్వాలను విమర్సించుకుంటూ కాలం గడిపేయడం ఏమేరకు సబబని తమ్మినేని ప్రశ్నించారు. ఆర్థిక సంఘం ముందు జగన్ ప్రస్తావన ఎందుకు తెస్తున్నారని నిలదీశారు. ఈ సందర్భంలో తమ్మినేని ఓ పిట్టకథ కూడా వినిపించారు. ఒంటిపై గోచీ మాత్రమే ఉన్న ఓ వ్యక్తి.. గొప్పల కోసం గోచీతీసి తలకు చుట్టుకున్నట్టుగా చంద్రబాబు ప్రవర్తన ఉందని సెటైర్లు వేశారు. చంద్రబాబుకు ప్రజలు ఐదేళ్ల వరకూ మాత్రమే అధికారం ఇచ్చారని తమ్మినేని గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రం తనకు తాను.. మరో పదిహేనేళ్ల దాకా ముఖ్యమంత్రినే అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అందుకే విజన్ -2029 అంటూ కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. ఈ వ్యవహారం మొత్తం చూస్తే చంద్రబాబుకు మతి భ్రమించిందేమో అంటూ తమ్మినేని ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఆయన కుటుంబం ఆయనకు చికిత్స చేయిస్తే మంచిదని ఉచిత సలహా ఇచ్చారు. జగన్ పార్టీ విమర్శలు ఎలా ఉన్నా... చంద్రబాబు తన ప్రసంగాలపై శ్రద్ద పెట్టాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. అన్నిచోట్లా అదే కథ వినిపిస్తే ఇలాంటి విమర్శలే వస్తాయి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: