అవసరం తీరాక.. అల్లుడ్ని ఏదో అన్నాట్ట వెనుకటికో మామ. అలాగే తయారయ్యింది కాంగ్రెస్ నేతల పరిస్థితి.. మన్మోహన్ సింగ్ అనే తోలుబొమ్మను ముందుపెట్టి.. అధికారాన్ని విచ్చలవిడిగా అనుభవించిన కాంగ్రెస్ పెద్దలు.. ఇప్పుడు ఆనాటి తప్పులన్నీ నోరులేని జీవి మీద తోసేందుకు సిద్ధమైపోయారు. మన్మోహన్ సింగ్ ముసుగులో బాధ్యతలేని అధికారాన్ని పదేళ్లపాటు అప్రతిహతంగా చెలాయించి.. ఇప్పుడు తీరిగ్గా.. ఆనాడు పొరపాటు జరిగి ఉండొచ్చంటూ విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు. గాంధీ కుటుంబం కోసం కాంగ్రెస్ నేతలు ఎంతటి దిగజారుడు రాజకీయాలైనా చేస్తారనడానికి తాజా కాంగ్రెస్ పెద్దల ప్రవర్తనే ఉదాహరణ. 2జీ స్కామ్ విషయంలో మాజీ కాగ్ యూపీఏ సర్కార్ లో జరిగిన తప్పులను ఏకరవు పెడుతుండే సరికి ఆత్మరక్షణలో పడిన కాంగ్రెస్.. మరోసారి మన్మోహన్ నే బలిపశువును చేయాలనుకుంటోంది. స్కామ్ జరిగిన ఇన్నాళ్లకు మన్మోహన్ పొరపాటు చేసి ఉండొచ్చంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. స్పెక్ట్రమ్ కేటాయింపులపై ఆందోళన వ్యక్తం చేస్తూ తాను మన్మోహన్ సింగ్ కు అప్పట్లో ఉత్తరం కూడా రాశానంటూ ఓ సాక్ష్యం కూడా తయారు చేసుకున్నారు. తన విజ్ఞప్తిని అప్పటి ప్రధాని పట్టించుకోలేదని.. పసలేని వాదన వినిపిస్తున్నారు. ఐతే... కమల్ నాథ్ వ్యూహం బెడిసికొట్టినట్టు కనబడుతోంది. కాంగ్రెస్ పెద్దలను కాపాడటానికి కమల్ నాథ్ ఈ తరహా వ్యాఖ్యలు చేసినా ఆయన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ 2జీ స్కామ్ లో తమ తప్పేమీ లేదని చెబుతూ వచ్చామని.. ఇప్పుడు కమల్ నాథ్ వాదన ద్వారా కాంగ్రెస్ తప్పు ఒప్పుకున్నట్టయిందని చెబుతున్నారు. ఎవరిని బలిపశువును చేయాలని చూసినా.. చివరకు పార్టీపై మచ్చ పడక తప్పదని చెబుతున్నారు. అంతిమంగా కమల్ నాథ్ వాదన కాగ్ మాజీ అధిపతి వినోద్ రాయ్ వాదనను సమర్థిస్తున్నట్టుగానే ఉంది తప్ప.. పార్టీని కాపాడేలా లేదని పెదవి విరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: