కాళోజీ జయంతి వేళ కేసీఆర్ మీడియాపై చేసిన వ్యాఖ్యల కలకలం కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో కేసీఆర్ పై విమర్శల దాడితో పాటు ఆయన్ను చిక్కుల్లో పడేసే పరిణామాలూ చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లూ ఉద్యమ హీరోగా జాతీయ స్థాయిలో ఉన్న ప్రతిష్ట ఒక్కదెబ్బతో మంటగలిసే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే జాతీయ మీడియా ఆయన్నో హిట్లర్ గా పోలుస్తూ.. తీవ్రఘాటు పదజాలంతో విమర్సించిన సంగతి తెలిసిందే.. తాజాగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేసీఆర్ వ్యాఖ్యలపై ఏకంగా విచారణ కమిటీని ఏర్పాటు చేయడం ఆయన్ను చిక్కుల్లోకి నెట్టనుంది. ఇప్పటికే కేసీఆర్ వ్యాఖ్యలను పీసీఐ ప్రెసిడెంట్ మార్కండేయ కట్జూ తీవ్రంగా నిరసించారు. కేసీఆర్ కామెంట్స్ పై వేసిన కమిటీలో సీనియర్ పాత్రికేయులు రాజీవ్ రంజన్ నాగ్, కె. అమర నాథ్, కృష్ణప్రసాద్ ఉన్నారు. వాస్తవానికి కేసీఆర్ ఏమని అన్నారు. వాటి నేపథ్యం ఏంటి.. అవి చట్టరీత్యా ఎలాంటి శిక్షలకు అర్హమైనవి అనే విషయాలపై ఈ కమిటీ నివేదిక ఇస్తుంది. వీటితో పాటు తెలంగాణలో మీడియా ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి.. అనే అంశాలపైనా కమిటీ పరిశీలన చేస్తుంది. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం తీరును టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానళ్లు ఎండగడుతూనే ఉన్నాయి. మరోవైపు సోషల్ మీడియాలోనూ కేసీఆర్ వైఖరిపై విస్తృతంగా నిరసన తెలుపుతున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవడమే కాదు.. ఏకంగా ఓ అంతర్జాతీయ సంస్థ కూడా ఈ వ్యాఖ్యలను తప్పబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛ కోసం పనిచేస్తోన్న కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్ అనే సంస్థ తెలంగాణలో మీడియా పట్ల కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నట్టు ప్రకటించింది. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నట్టు.. ఈ వివాదానికి ముగింపు పలికే ఆలోచన టీఆర్ఎస్ వర్గాల నుంచి ఏమాత్రం కనిపించడం లేదు. అటు మీడియా కూడా వెనక్కుతగ్గేలా లేదు. పీసీఐ నివేదిక కేసీఆర్ కు వ్యతిరేకంగా వస్తే.. జాతీయ స్థాయిలో తెలంగాణ పరువుపోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: