ఎర్రచందనం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు మొదట్లో ఎంత ఘనంగా చెప్పారో ఇప్పుడు ఆ వ్యవహారం అంత స్లో అయ్యింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే... ఎర్రచందనం దుంగల గురించి ప్రచారం మొదలైంది. చాలాసామాన్య జనాల్లోకి కూడా ఈ వ్యవహారం వెళ్లిపోయింది. ఎర్రచందనం నిల్వలను అమ్మేసి బాబు హామీల అమలు చేస్తాడని... రైతు రుణమాఫీ తదితరాలన్నీ ఆ డబ్బుతోనే జరుగుతాయని తెలుగుదేశం నేతలు చెప్పుకొచ్చారు. మాస్ లోకి ఈ ప్రచారం చొచ్చుకుపోయింది. ఎర్రచందనం అంతటిని అమ్మేస్తే.. ఇచ్చిన హామీలనే కాదు, ఇవ్వని హామీలను కూడా ఎన్నో అమలు చేయవచ్చని... ఏపీ ప్రజల బతుకులనే మార్చేయవచ్చని చంద్రబాబు ప్రభుత్వ మనుషులు వ్యాఖ్యానించ సాగారు. సీమాంధ్రుల బతకులు ఇక స్వర్గధామంలోకి అడుగు పెట్టినట్టేనని అన్నారు. అయితే రోజులకు రోజులు, నెలలకు నెలలు గడిచిపోతున్నాయి కానీ ఇప్పటి వరకూ ఎర్రచందనం గురించి ఏమీ తేల్చడం లేదు. మరి ఎర్రచందనం చెట్లను నరకడం మాట అటుంచి... స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకొన్న ఎర్రచందనం వేలమైనా జరిగితే ఎంతో కొంత డబ్బు వస్తుందని అనుకొంటే ఇప్పుడు అది కూడా కష్టం అయినట్టు తెలుస్తోంది. స్మగర్ల నుంచి స్వాధీనం చేసుకొన్న ఎర్రచందనం నిల్వలను వేలం వేయడానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అంత సక్సెస్ ఫుల్ గా లేవు. తాజాగా వేలం రెండోసారి వాయిదా పడింది. విదేశీ వ్యాపారులు ఎర్రచందనం దుంగలను పరిశీలించే పనిలో ఉన్నారని... అందుకే టెండర్ల స్వీకరణ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. వేలం పాటకు సంబంధించి అక్టోబర్ పది నుంచి 17 మధ్య ఈ టెండర్లను స్వీకరిస్తామని తెలిపారు. మరి అప్పుడైనా ప్రభుత్వ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉండాలని కోరుకొందాం!

మరింత సమాచారం తెలుసుకోండి: