చిత్తూరు జిల్లా తవణంపల్లె మండల పరిధిలోని మోదలపల్లి పంచాయతీ జి వడ్డిపల్లికి చెందిన టి దయ్యప్ప (37)ని భార్య గుప్తనిధుల కోసం బలిచ్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో ముగ్గురు యువకులతో కలిసి పథకం ప్రకారం సిద్దేశ్వర కోన అడవుల్లోకి తీసుకువెళ్లి హత్య చేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అది బలి కాదని, పొలాల వద్ద విద్యుదాఘాతం ప్రమాదంలో మృతిచెందాడని పోలీసులు కేసు నమోదు చేశారు. దయ్యప్పకు, పలమనేరుకు చెందిన మహిళకు పెద్దల సమక్షంలో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఆమె తరచూ భర్త, ముగ్గురు పిల్లలను వదిలివేసి పుట్టింటికి వెళ్లేది. అయితే శుక్రవారం ఉదయం మరో ముగ్గురు యువకులతో భర్త వద్దకు వచ్చిన ఆమె సిద్దేశ్వరకొండలో గుప్త నిధులు ఉన్నాయని చెప్పింది. తనతోపాటు వచ్చిన ముగ్గురు యువకులు దయ్యప్పను అడవుల్లోకి తీసుకెళ్లారు. ఏం జరిగిందో ఏమో తెలియదు. మరుసటి రోజు అతను అడవిలో శవమై తేలాడు. సమాచారం తెలుసుకుని గ్రామస్థులు, పోలీసులు అక్కడకు వెళ్లి పరిశీలించగా మృతుడు దయ్యప్ప ముఖంపై బండరాయితో కొట్టిచంపినట్టు ఆనవాళ్లు ఉన్నాయి.  శరీరం అంతా వాతలుపడి, కమిలిన గాయాలున్నాయి. దయ్యప్పను కర్రలతో, రాడ్లతో కొట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. విద్యుత్‌షాక్ తగిలితే చర్మం ఊడిపోయేదని, శరీరం అంతా కాలిపోయినట్టు ఉండేదని గ్రామస్తులు అంటున్నారు. అయితే అలాంటి అనవాళ్లు ఏమి మృతుని శరీరంపై కనిపించడం లేదు. మృతుని భార్య వాదన విన్న పోలీసులు విద్యుదాఘాతంలో మృతి చెందినట్టు కేసు నమోదు చేశారు. తనతోపాటు తమిళనాడుకు చెందిన ముగ్గురు యువకులు వచ్చారని, అయితే గుప్తనిధులు తీస్తామని తనను నమ్మించి భర్తను సిద్దేశ్వర కొండకు తీసుకెళ్లారని చెబుతోంది. తరువాత విద్యుదాఘాతంతో చనిపోయినట్టు ఆ యువకులు వారి బంధువులకు చెపితే వారు తనకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని భార్య చెబుతోంది. అప్పటి వరకూ తన భర్త మృతి చెందిన విషయం తనకు తెలియదని తెలిపింది. అయితే మృతుని బంధువులు భార్య ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివాహేతర సంబంధంతో భర్తను భార్యే హత్య చేయించిందా? లేక గుప్తనిధుల కోసం బలిచ్చారా? అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అయితే పోలీసులు విద్యుత్‌షాక్‌తో మృతి చెందారని కేసు నమోదు చేయడం, మృతుడు పడివున్న ప్రాంతంలో ఎటువంటి కరెంటు తీగలు లేవని తెలిసినా ఆ కేసు నమోదు చేయడం ద్వారా పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మృతుడు పడివున్న సిద్దేశ్వర కొండ ప్రాంతానికి సిఐ రవిమనోహర ఆచారి, ఎస్‌ఐ ధరణీధర వెళ్లి పరిశీలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: