జైపాల్ రెడ్డి అంటే మేధావి రాజకీయ వేత్తగా ఓ గౌరవం ఉంది. ఇటీవల కేసీఆర్ సర్కారుపై కాంగ్రెస్ నేతలు విమర్శల జోరు పెంచడంతో ఆయన కూడా వారికి గళం కలిపారు. మీడియాపై కేసీఆర్ దాడి చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో జైపాల్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వ తీరుని ఘాటుగానే విమర్శించారు. జైపాల్ విమర్శలను తిప్పికొట్టేందుకు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ప్రయత్నించారు. కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదన్న విమర్శలపై పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎలా దెబ్బతీశామో.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమి తప్పు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా కేటీఆర్ జైపాల్ రెడ్డిపై సెటైర్లు వేశారు. మీడియాలో హెడ్ లైన్ల కోసం ప్రెస్ మీట్లు పెట్టవద్దంటూ వెటకారం చేశారు. మీడియాకు అండగా నిలిస్తే.. వారు తమను హైలెట్ చేస్తారన్న భ్రమల్లో ఉండొద్దని పరోక్షంగా సూచించారు. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అభివృద్ధిలో శరవేగంగా ముందుకుపోతున్నా వ్యక్తిగతంగా నిరాధారణ ఆరోపణలు చేయడం జైపాల్‌రెడ్డి వంటి సీనియర్ నేతకు తగదని హితవు పలికారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎవరి వల్ల దెబ్బతిన్నదో ఆత్మ విమర్శ చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రులు, ఐఏఎస్ అధికారులు అక్రమాలు, కుంభకోణాలు, భూకబ్జాలకు పాల్పడ్డ కేసుల్లో చార్జీషీట్లు ఎదుర్కొని, జైలు శిక్షలు అనుభవించారన్నారు కేటీఆర్. హైదరాబాద్‌లో నాటి మంత్రులు భూకబ్జాలలకు, బెదిరింపులకు, వసూళ్లకు పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. సాక్షాత్తు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై కూడా అవినీతి ఆరోపణలతో చార్జీషీటు దాఖలైన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. నిర్ధిష్ట ఆరోపణలను చూపిస్తే తమ, పర అనే భేదం లేకుండా చర్యలు తీసుకోవడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: