తెలుగునేలకు ఐటీని పరిచయం చేశానని చెప్పుకునే చంద్రబాబు మరో హైటెక్ మాయాజాలానికి తెరలేపారు. నవ్యాంధ్రలోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేబినెట్‌ భేటీల అజెండాను మంత్రులందరికీ పంపించడం నుంచి.... సంబంధిత ఫైళ్లను కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంత ఎక్కువగా వాడుకోవడంలో ముందుండే ముఖ్యమంత్రి చంద్రబాబు దీని కోసం మంత్రులకు ప్రత్యేక సాఫ్ట్‌ వేర్ లోడ్ చేసిన ట్యాబ్‌లను అందించారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ ఎలక్ట్రానిక్‌ పద్ధతిలోకి తీసుకొచ్చేందుకు నడుంబిగించిన చంద్రబాబు మంత్రులకు సంబంధించిన ఫైళ్లను వెబ్‌రూపంలోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం ఫైల్‌క్లౌడ్‌ పరికరాన్ని ఉపయోగించి ప్రత్యేక సాప్ట్‌వేర్‌ను రూపొందించారు. కేబినెట్‌ సమావేశంలో చెప్పదల్చుకున్న విషయాలు ఏమైనా ఉంటే... మంత్రులంతా ముందే ఈ ఐపాడ్‌ ద్వారా పంపించవచ్చు. పత్రాలను అప్‌లోడ్ చేయొచ్చు. సమచారాన్ని మంత్రులందరూ పంచుకోవడంతోపాటు.. ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకోవచ్చు. మంత్రివర్గ సమావేశాలకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లన్నీ ఐప్యాడ్‌లో లోడ్‌ చేయడం వల్ల వాటిని రహస్యంగా ఉంచేందుకు మూడు సేఫ్టీ కోడ్‌లను ఏర్పాటు చేశారు. ఈ కోడ్‌లు మంత్రులకు తప్ప మరో వ్యక్తికి తెలియవు. సమాచారాన్ని ప్రింట్ తీసుకోవడమూ సాధ్యం కాదు. టెక్నాలజీని వాడుకోవడం మంచిదే కానీ.. దీన్ని వాడే పరిజ్ఞానం మంత్రులకూ తెలియాలి కదా. మరి మన మంత్రులు బాబు స్పీడును అందుకుంటారా.. ఎప్పుడూ అందుబాటులో ఉండే మంత్రులు, ఫైళ్ల కోసం ఇంత హంగామా అవసరమా.. దీంతో కొత్తగా సాధించేదేముందన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: