వరదలతో అతలాకుతలమైన కాశ్మీరాన్ని ఆదుకోవాలంటూ ఆ రాష్ట్ర ప్రజాప్రతినిధులు, మంత్రులు మోడీని కలిశారు. ఈ వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తికి మోడీ కూడా సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తోంది. శతాబ్దకాలంలో అతిపెద్ద ప్రకృతి విపత్తును చవిచూసిన జమ్మూ-కాశ్మీర్‌ నెమ్మదిగా కోలుకుంటోంది. కాశ్మీర్‌ లోయలో వరద నీటి స్థాయి క్రమంగా తగ్గుతోంది. లక్షా 42 వేల మందిని సైన్యం సురక్షిత ప్రాంతాలకు చేర్చింది. ఇంకా లక్షా 50 వేల మంది ముంపు ప్రాంతాల్లోనే చిక్కుకున్నారు. సైన్యం, స్థానిక యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు సహాయక కార్యక్రమాల్ని ముమ్మరం చేశాయి. సాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరినీ ఆదుకోవడమే లక్ష్యంగా అహర్నిశలు పనిచేస్తున్నాయి. తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్న వరద బాధితులకు ఆహారం, ఇతర నిత్యావసరాలు అందిస్తున్నారు. వరదనీరు తగ్గుముఖంపట్టడంతో స్థానికులు ఇళ్లకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. రహదారులు, నివాస ప్రాంతాలు నీట మునిగి బురదమయం కావడంతో పారిశుద్ధ్య సమస్య తలెత్తుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న అధికారిక లెక్కల ప్రకారం వరదల కారణంగా జమ్మూ ప్రాంతంలో 129 మంది, కాశ్మీర్‌ లోయలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య 250 దాటవచ్చని అనధికారిక వర్గాల సమాచారం.. ఉత్తరకాశ్మీర్‌లో వరద నీటి మట్టం పెరగడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అంటువ్యాధులు ప్రబల కుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. నీటిని శుద్ధి చేయడానికి లక్షల సంఖ్యలో క్లోరిన్‌ మాత్రలను సరఫరా చేస్తున్నారు. పారిశుద్ధ్యం మెరుగుపర్చడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మున్సిపల్‌ సిబ్బందిని ప్రభుత్వం ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: