లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ చాలా రోజుల తర్వాత మీడియా ముందు వచ్చారు. ఒకటి కాదు.. రెండు కాదు.. వస్తూ వస్తూనే చాలా బాంబులు పేల్చారు. వాటిలో మొదటిది ఆయన పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతల నుంచి త్వరలో వైదొలగుతారట. సమర్థులకు అవకాశం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారంట. అంటే ఆయన సమర్థుడు కాదని ఒప్పుకున్నట్టేనా.. ఐతే.. రాజకీయాల్లో మాత్రం కొనసాగుతానంటున్నారు జేపీ. లోక్ సత్తా ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకే మిగిలిన సమయం వెచ్చిస్తారట. జేపీ పేల్చిన రెండో బాంబు.. చంద్రబాబు సర్కారుపై ఘాటుగా విమర్శలు గుప్పించడం. వేరు వేరు పార్టీలే అయినా చంద్రబాబుపై అంతగా విమర్శలు చేయని జేపీ.. ఈసారి మాత్రం చెలరేగిపోయారు. అసలు రాష్ట్ర విభజన పాపం చంద్రబాబు, వైఎస్ లదేనని తేల్చి చెప్పారు. ఒకవైపు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటే.. మరోవైపు చంద్రబాబు కోట్లకుకోట్లు దుబారా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రమాణ స్వీకారానకి 30 కోట్లు, సెక్రటేరియట్ లోని కార్యాలయానికి 10కోట్లు ఖర్చు అవసరమా అని నిలదీశారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారుల లాభం కోసమే రోజుకో ప్రకటన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో రుణమాఫీ అసాధ్యమన్నజేపీ.. అధికారంలోకి వచ్చేందుకు అయిన ఖర్చును రాబట్టుకోవడమే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగుతోందన్నారు. జేపీ పేల్చిన మూడో బాంబు.. ఏపీకి ప్రత్యేక హోదా అసాధ్యమని తేల్చేయడం. చంద్రబాబు ఈ విషయంలో ప్రజలకు భ్రమలు కల్పిస్తూ కాలం గడిపేస్తున్నారని జయప్రకాశ్ నారాయణ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా దేశంలో కొత్త వివాదానికి దారి తీస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి మన రాష్ట్రం వాడే అయినా కూడా ఇది సాధ్యం కాదని జేపీ వివరించారు. ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు ఎప్పటి నుంచో ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తున్నాయని.. ఏపీకి ఇప్పుడు హోదా ఇస్తే అవి ఊరుకోవని తెలిపారు. బెజవాడలో మురికివాడలను అభివృద్ధి చేయలేని వారు.. లక్షల కోట్ల తో రాజధాని నిర్మిస్తామంటూ భ్రమలు కల్పిస్తున్నారని జయప్రకాశ్ ఆరోపించారు. జేపీ ఈ రేంజ్ లో చంద్రబాబుపై చెలరేగిపోవడం రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తిరేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: