‘చాలు బాబూ డాబు’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ధ్వజమెత్తారు. ఇందిరా భవన్‌లో సోమవారం తెలుగుదేశం ప్రభుత్వం 100 రోజుల పాలనపై వాస్తవ పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో రైతు, డ్వాక్రా రుణాల మాఫీపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బహిరంగంగా ఇచ్చిన హామీలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మీడియాకు చూపించారు. గతంలో చంద్రబాబు చేసిన ప్రసంగం వీడియో క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు. రైతుల రుణాలను బేషరతుగా రద్దు చేస్తామని ప్రకటించిన చంద్రబాబు తర్వాత వాటికి షరతులు విధిస్తున్నారని రఘువీరా ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాల విషయంలోనూ మెలికలు పెడుతున్నారన్నారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి, చివరికి లక్ష రూపాయల రివాల్వింగ్‌ ఫండ్‌ ఇస్తామని మెలిక పెడుతున్నారని రఘువీరా అన్నారు. 100 రోజుల పాలనలో 101 సార్లు రైతు, డ్వాక్రా రుణాలపై చంద్రబాబు నాలుక మడతపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణ మాఫీ జరిగిపోయిందని తెలుగుదేశం నాయకులు డాంబికాలు పలుకుతున్నారని, మరో వైపు రైతులు తీసుకున్న బంగారు రుణాలకు సంబంధించి ఆభరణాల వేలాన్ని బ్యాంకర్లు కొనసాగిస్తున్నారన్నారు.  ఆడపడుచుల బంగారు ఆభరణాల వేలం జరగకుండా తాము గ్రామాల్లో అడ్డుపడుతున్నామని రఘువీరా చెప్పారు. చంద్రబాబు 100 రోజుల పాలనలో బ్యాంకులు రైతులకు లోన్‌ హాలీడేను ప్రకటించాయని విమర్శించారు. ఇది స్వతంత్ర భారత దేశంలోనే ప్రపథమమని రఘువీరా ధ్వజమెత్తారు. బాబు వస్తే జాబు వస్తుందని ఆర్భాటపు ప్రకటనలు చేశారని, కానీ ఇప్పటికి డీఎస్‌సీ ఎన్నిసార్లు వాయిదా పడిందో తెలియదని, ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఆదర్శ రైతులు, రేషన్‌ డీలర్లు, చివరికి మధ్యాహ్న భోజన పథకం సిబ్బందిని కూడా చంద్రబాబు రోడ్డున పడేఽశారని రఘువీరా ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్ధులకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాలపై స్పష్టత లేదన్నారు. వేలాది ఇంజనీరింగ్‌ సీట్లు మిగిలి పోయాయని, విద్యార్ధులు కాలేజీల్లో చేరే అవకాశం లేకుండా చేశారన్నారు. బీజేపీ, టీడీపీ రెండూ కలసి రుణమాఫీకి మంగళం పాడాలనుకుంటున్నాయని రఘువీరా దుయ్యబట్టారు.  రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సిమెంట్‌ బస్తా 100 రూపాయలు పెరిగిందని రఘువీరా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉండే ఐదేళ్లలో ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా .. విజన్‌ 2029 అంటూ చంద్రబాబు డాంబికాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. బాబు పాలనలో మంత్రులు జీరోలయ్యారని విమర్శించారు. టీడీపీ హామీలను నెరవేర్చాల్సిందేనని, ఇందు కోసం తాము ప్రజా గొంతుకలమవుతామని రఘువీరా పేర్కొన్నారు. సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, రాష్ట్ర మాజీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సి. రామచంద్రయ్య, అహ్మదుల్లా, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: