పులిచింతల ప్రాజెక్టు లోని నీటి నిల్వలు తగ్గించడమే కాకుండా నష్టపరి హారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒప్పుకుంది. 11 టిఎంసిల నీటి నిల్వను 7 టిఎంసిలకు తగ్గించేందుకు అంగీకరించింది. నీటి నిల్వ కారణంగా పులిచింతల ముంపు గ్రామాలకు తక్షణ ముంపు ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లాలో ముంపునకు గురవుతున్న నాలుగు గ్రామాలకు రూ.20 కోట్ల బకాయిల చెల్లింపునకు కూడా ఎపి ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ నిధులను నల్గొండ జిల్లా కలెక్టరుకు ఇచ్చి బాధితులను ఆదుకునేందుకు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. మొత్తం రూ.30 కోట్ల బకాయిలలో రూ.10 కోట్లను మాతమ్రే గతంలో ఎపి ప్రభుత్వం చెల్లించింది. మిగిలిన రూ.20 కోట్లు చెల్లించేందుకు తాజా చర్చల్లో ఒప్పుకుంది. ఈ మేరకు గురువారం ఆంధ్రా సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్‌.కృష్ణారావు, తెలంగాణ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఎపి నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాధ్‌ దాస్‌, తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి జోషి సమావేశమై చర్చించారు. నాలుగు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఎపి ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో గురువారం సమావేశం జరిగింది. ఇదే అంశంపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, ఎపి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో మాటాడారు..

మరింత సమాచారం తెలుసుకోండి: