ముస్లింల దేశభక్తిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ స్వప్రయోజనాల కోసం చేసినవని బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి ఆరోపించారు. మైనారిటీ మతస్తుల పట్ల ఈ పార్టీ వ్యవహరించే తీరుకు భిన్నంగా ఉన్నందున ఈ వ్యాఖ్యలపై అనుమానాలు సహజమేనని చెప్పారు. ''ముస్లింల దేశభక్తి గురించి నరేంద్రమోడీ చేసిన ప్రకటనపై సందేహాలు రావడం సహజం. ఇవి ఆయన పార్టీ లక్షణాలకు సరిపడనవి. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ వ్యాఖ్యలు చేశారు'' అని మాయావతి తన ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన పార్టీ ప్రవర్తన, ఆ కూటమిలోని భాగస్వాములు ప్రవర్తన ఎప్పుడూ ఇందుకు భిన్నంగా ఉంటుందని అన్నారు. వారి మాటలు, చేతల మధ్య చాలా తేడా ఉంటుందని, వారి వైఖరి ఎప్పుడూ ముస్లిం వ్యతిరేకమేనని పేర్కొన్నారు. మతతత్వ వ్యాప్తి, సంకుచిత జాతీయవాదంపై ఎప్పుడూ ఆరోపణలు ఎదుర్కొనే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నీతులు వల్లిస్తున్నారని ఆరోపించారు. అత్యున్నత అధికారాలను చేపట్టినవారు రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వర్తించకుండా హిందూత్వ శక్తులకు స్వేచ్ఛను కల్పిస్తున్నారని అన్నారు. ఒకవైపు ముస్లింల దేశభక్తిపై ప్రకటనలు చేస్తున్న మోడీ మరోవైపున సమాజంలో విద్వేషాలను రగిల్చే చర్యలకు పాల్పడుతున్న తమ పార్టీ విద్యార్థి విభాగం, ఇతరులపై ప్రకటనలు చేస్తున్నారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: