లంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి విపక్ష నేతలపై ధ్వజమెత్తారు. టీడీపీ రేవంత్‌ రెడ్డిని ‘బచ్చాగాడు’గా పేర్కొన్న ఆయన.. కాంగ్రెస్‌ నేతలు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డిలను ఉద్దేశించి ఘాటుగా విమర్శలు చేశారు. ఉప్పల్‌ నియోజకవర్గానికి చెందిన సీపీఎం, సీపీఐ నాయకులు, కార్యకర్తలు.. నాయిని, టీఆర్‌ఎస్‌ పార్టీ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడి తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ప్రసంగించిన నాయిని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారని, దసరా నుంచి ప్రజాహిత కార్యక్రమాలు అమలవుతాయని చెప్పారు. రాజకీయాలకతీతంగా అందరం కలిసి తెలంగాణను పునర్నిర్మాణం చేసుకుందామని పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరిగేవరకూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిద్రపోదన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి శ్రమిస్తున్న కేసీఆర్‌ను విమర్శించేవారు అడ్రస్‌ లేకుండా పోతారన్నారు. ‘‘ఇవాళ ఎవరో ఏదో మాట్లాడితే మనం మాట్లాడేదేం లేదు. ఇహ, వాని గురించి ఎందుకు మాట్లాడతరో మీరు.. ఊకే రేవంత్‌ రేవంత్‌ రేవంత్‌.. అనవసరంగ వాణ్నో పెద్ద లీడర్‌ చేస్తున్నం మనం. ఆడు బచ్చాగాడు. ఆ బచ్చాగాణ్ని మనం ఊకే ఎక్కువ మాట్లాడితే అనవసరం. ఆనికంట ఎవడో అన్నాడంట.. నువు ముఖ్యమంత్రి అయితవంటే, ఇగ వాడు ఓ.. ఎగురుతా ఉన్నడు పొట్టోడు. వాని కల కలనే ఉంటది. కలల వస్తే అది రాదు నిజం గాదు’’ అని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ‘‘కేసీఆర్‌ని తిడితే ఎవడో పెద్ద లీడరైతననుకుంటే అది భ్రమ. కేసీఆర్‌ని తిట్టినోడు అడ్రస్‌ లేకుండపోతడని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కేసీఆరు ఆయన సొంతం కొరకేం జేస్తలేడు’’ అని నాయిని స్పష్టం చేశారు. తన పార్టీ నేతలతో మాట్లాడించడం కాకుండా.. తానే స్వయంగా మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆయన సూచించారు. ‘‘ఈనాడు చంద్రబాబుగారు.. మరి రాజకీయాల్లో ఆయన విడిపోయిండు. మన తెలంగాణ నుంచి పోయిండు. ఆయన ఆంధ్రలో ఉన్నడు. ఆయన ప్రాంతం ఆయన్ని అభివృద్ధి చేసుకోమను. మన ప్రాంతం మనం అభివృద్ధి చేసుకుందాం. నైబరింగ్‌ స్టేట్లు ఒకరికొకరికి సహకారాలందించుకుందాం కానీ.. ఊకే గిచ్చికయ్యం పెట్టుకుంటే.. చేసుకున్న భార్య కూడ ఉండదురా బాబో.. చంద్రబాబో.. ఊకే గిచ్చి కయ్యం పెట్టుకోకు. ఎక్కడో కరెంటు మీద అడ్డుపడతడు. ఇంకేదో అడ్డం పడతడు. ఇంకేదో అడ్డం పడతడు. వానితోటి ఒకటి అనిస్తడు.. వీనితోటి ఒకటి అనిస్తడు.. అరె, నీదేమన్న మాట్లాడితే డైరెక్టుగా నువ్వు మాట్లాడరా చంద్రబాబో.. వీళ్లతోటి, వాళ్లతోటి చంచాగాళ్లతోటి ఎందుకు మాట్లాడిస్తవ్‌?’’ అని బాబును విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో జరిగినన్ని అవినీతి కుంభకోణాలు ఎప్పుడూ జరగలేదన్న నాయిని.. ఆ పార్టీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీస్తామన్నారు. దోపిడీదారుల కుట్రలనుబయట పెడతామన్నారు. ‘‘జానారెడ్డంటడు.. ‘ఏమయ్యా చేతగాకపోతే దిగిపోరాదు’! మేం దిగిపోయేదానికొచ్చినాం? మీ భరతం పట్టేదానికొచ్చినాం బిడ్డా! మీరుజేసిన కుంభకోణాల్ని బయటపెడతం. ఏం వదిలిపెట్టే సమస్య లేదు’’ అని జానారెడ్డిని ఉద్దేశించి అన్నారు. అలాగే.. లంచాలకు మంచాలేశారంటూ పొన్నాల లక్ష్మయ్యనూ తీవ్రంగా విమర్శించారు. ‘‘పొన్నాల లక్ష్మయ్య.. ఏందేందో మాట్లాడతడు. నీవే లంచాలకు మంచాలేసినటువంటి మంత్రిపదవి చేసిన నువ్వే రాజశేఖర్‌రెడ్డికి అన్నివిధాల అన్యాయం జేసినవు మాకు. ప్రాజెక్టుల నీళ్లన్నీ మలిపినవు. పోతిరెడ్డిపాడు ఎక్కణ్నుంచీ వచ్చింది? ఈయన పీరియడ్‌ల వచ్చింది. ఇయ్యాల పులిచింతల ఎవరి పీరియడ్‌ల వచ్చింది? ఈయన పీరియడ్‌ల వచ్చింది? పోలవరం ఎవరి పీరియడ్‌ల వచ్చింది? పొన్నాల లక్ష్మయ్య పీరియడ్‌ల వచ్చింది. పొన్నాల లక్ష్మయ్యా.. నువ్వు మాట్లాడకుంటేమర్యాదుంటది. మాట్లాడితే ఉన్న మర్యాదెందుకు పోగొట్టుకుంటవు? నాయనా ఇది మంచిదిగాదు’’ అన్నారు. ప్రజల అభిప్రాయం మేరకే కేసీఆర్‌ పనిచేస్తున్నారని.. వారి అభిప్రాయం మేరకే సంక్షేమ కార్యక్రమాలు రూపొందించారని, వాటన్నిటినీ విజయవంతం చేసి తెలంగాణ ప్రజలను ఆదుకోవడానికి, తెలంగాణను ముందుకు తీసుకుపోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారని ముఖ్యమంత్రిని కొనియాడారు. వాటన్నిటినీ అక్టోబర్‌ 2 నుంచి అమలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ‘‘నిజంగా అమలుజేస్తే వీళ్లందరూ అంగీలు చింపుకోవాల. ఒక్కొక్కళ్లు అంగీలు చింపుకోవాల. ఇంకెవ్వనికీ అడ్రస్సుండదు. చూడండి అమలైతే ఏమైతదో’’ అని విపక్ష నేతలను ఉద్దేశించి అన్నారు. అరాచకాలను అరికట్టేందుకు సీఎం కేసీఆర్‌ పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నారని చెప్పారు. ఆ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామన్నారు. ఇక.. కార్యకర్తలే పార్టీ సారథులని కె.కేశవరావు అన్నారు. నవ తెలంగాణ నిర్మాణమే ఏకైక లక్ష్యంగా తాము కృషి చేస్తున్నామని, అన్ని వర్గాల సహకారం లభించినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమని ఆయన పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారని, ఆయన డైరెక్షన్‌లోనే తెలంగాణ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: