తన కుమారుడు నడుపుతున్న చానల్‌ కోసమే.. టీవీ-9, ఏబీఎన్‌ ప్రసారాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణలో నిలిపివేశారని టీ-టీడీపీ సీనియర్‌ నేత రేవంత్‌ రెడ్డి విమర్శించారు. ‘‘‘వెంటనే చానళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలి. లేదంటే గ్రామాల్లో కేబుల్‌ వైర్లు కట్‌ చేసేస్తాం. అలా చేయాలని మా కార్యకర్తలకు పిలుపునిస్తాం. అప్పుడిక ప్రభుత్వం స్పందించక ఏమి చేస్తుంది’’ అని రేవంత్‌ హెచ్చరించారు. టీవీ-9, ఏబీఎన్‌ ప్రసారాలపై నిషేధం విధించి 100 రోజులు అయిన సందర్భంగా.. హైదరాబాద్‌లోజరిగిన ‘మీడియా స్వేచ్ఛ పరిరక్షణ సదస్సు’లో ఆయన పాల్గొన్నారు. ‘‘కేసీఆర్‌, ఆయన కొడుకు ఒకటే మాట చెబుతున్రు.  చానల్‌ ప్రసారాలకు, ప్రభుత్వానికి సంబంధం లేదట! మేము వినియోగదారులం... నెలకు రూ.250లను ఎంఎస్‌వోలు వసూలు చేస్తుండ్రు. మూడునెలల నుంచి టీవీ-9, ఏబీఎన్‌ ప్రసారాలను ఎంఎస్‌వోలు ఇవ్వడం లేదు. మా హక్కులు కాపాడే బాధ్యత మీకు(ప్రభుత్వానికి) లేదా? ఒకవేళ బాధ్యత లేదంటారా? ఎక్కడికక్కడ గ్రామాల్లోని కేబుల్‌ వైర్లు పీకేయమని ఈ రోజే మా కార్యకర్తలకు చెబుతాం’’ అని ఆయన హెచ్చరించారు. ‘‘సీఎం కేసీఆర్‌కు ఒక టీవీ చానల్‌, ఒక పత్రిక ఉంది. అవి నెంబర్‌ వన్‌ కావాలంటే, నెంబర్‌వన్‌లో ఉన్న వాటిని నిషేధించాలి. అందుకే నిషేధించారు. ఇది వ్యాపారకుట్ర.’’ అని ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: