తన భర్త, మరి కొంతమంది అల్లరిమూకతో దాడి చేసి తన బిడ్డను తన దగ్గర నుంచి దౌర్జన్యంగా తీసుకెళ్లారని, తన బిడ్డను తిరిగి తనకు అప్పగించాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కోడలు పద్మప్రియ అభ్యర్థించింది. సోమవారం తన తల్లిదండ్రులతో కలిసి విశాఖలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామకృష్ణతో 2009 ఆగస్టు 6 తేదీన తనకు వివాహమైందని చెప్పారు. వివాహమైన కొద్ది రోజుల నుంచి తనను మామ శివప్రసాదరావు, భర్త శివరామకృష్ణ, ఆడబడచు శశికళ నిత్యం మానసికంగా వేధించేవారని పేర్కొంది. తను గర్భం దాల్చినప్పటికీ వేధింపులు తగ్గలేదని ఆమె కన్నీటి పర్యంతమైంది. అత్తింటి ఆరళ్ళు భరించలేక, నాల్గవ నెలలో తన పుట్టింటికి వచ్చేశానని పద్మప్రియ పేర్కొంది. కొంత కాలం తరువాత పెద్దల జోక్యంతో తన భర్త కాపురానికి తీసుకువెళ్లారని చెప్పింది. ఆ తరువాత కూడా వేధింపులు తప్పలేదని తెలియచేసింది. వివాహ సమయంలో 10 లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చామని, ఇంకా చాలదని, మరికొంత మొత్తాన్ని తీసుకురమ్మనమని వేధించేవారని చెప్పింది. వేధింపులు భరించలేక, గత ఏడాది విశాఖలోని తన పుట్టింటికి వచ్చేశానని చెప్పింది. ఇదిలా ఉండగా ఈనెల 17న రాత్రి 10 గంటల సమయంలో తన భర్తతో శివరామకృష్ణ, మరికొంతమంది డాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నగరానికి చెందిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జునరావు తన ఇంటి తలుపులు బద్దలుకొట్టి తనను, తన తల్లిదండ్రులను తీవ్రంగా కొట్టి, నాలుగేళ్ల వయస్సున్న తన కొడుకు గౌతమ్‌ను దౌర్జన్యంగా తీసుకువెళ్లిపోయారని పద్మప్రియ తెలియచేశారు. ఈ విషయాన్ని తాను ఎసిపికి ఫోన్‌లో తెలియచేయగా, ఫిర్యాదు తీసుకున్నారన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లగా, అప్పటికే విశాఖలో కోడెలకు చెందిన ఓ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తితో తన తల్లిదండ్రులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారని పద్మప్రియ పేర్కొంది. తన నుంచి దూరమైన తన బిడ్డ ఎలా ఉన్నాడో అని తనకు ఆందోళనగా ఉందని, తన బిడ్డను తనకు అప్పగించాలని, తన తల్లిదండ్రులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని పద్మప్రియ డిమాండ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: