ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలే కాకుండా ఇకమీదట బుల్లెట్ ప్రూఫ్ గోడలు కూడా రక్షణ కల్పించనున్నాయి. సచివాలయంలోని ఎల్-బ్లాక్‌లో చంద్రబాబుకు కల్పించే భద్రతపై నిఘా విభాగం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రోడ్డువైపు ముఖ్యమంత్రి కార్యాలయం ఉండడంతో బులెట్ ప్రూఫ్ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. చంద్రబాబు కార్యాలయం ఎల్-బ్లాక్‌లోని ఎనిమిదవ అంతస్తులో ఉంది. సాధారణంగా ముఖ్యమంత్రి చాంబర్‌తో పాటు మంత్రివర్గ సమావేశం నిర్వహించే గదులకు మాత్రమే బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను అమర్చుతున్నప్పటికీ ఆ అద్దాలకు ఆనుకుని ఉన్న గోడలకు కూడా బుల్లెట్ ప్రూఫ్ చేయాలన్న ఆలోచనకు అధికారులు వచ్చారు. దీనికోసం ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ సిమెంట్, పెయింట్‌ను ఉపయోగించాలని నిర్ణయించారు. దీంతో గోడలకు రెండు మూడు మిల్లీమీటర్ల మందంతో ప్రత్యేక సిమెంట్ పొరలు ఏర్పాటు చేస్తారు. ఇవి చిన్న పిస్తోళ్ల నుంచే కాకుండా, పెద్ద తుపాకుల నుంచి వచ్చే బుల్లెట్లను కూడా తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఇటువంటి బుల్లెట్ ప్రూఫ్ గోడలు విదేశాల్లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బుల్లెట్ ప్రూఫ్ సిమెంట్‌ను ఉపయోగిస్తుండగా, మరికొన్ని చోట్ల బుల్లెట్ ప్రూఫ్ పెయింట్‌ను ఉపయోగిస్తున్నారు. ఎల్-బ్లాక్‌లో ముఖ్యమంత్రి కార్యాలయానికి బయట బిర్లా టెంపుల్, అమృత క్యాజిల్ హోటల్ వంటి ఎత్తయిన భవనాలు ఉన్నాయి. ఇవి ముఖ్యమంత్రి చాంబర్‌కు దాదాపు సమాన ఎత్తులో ఉండడంతో ప్రత్యేక భద్రతా చర్యలపై దృష్టి పెట్టాలని అధికారులు యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒకవైపు ముఖ్యమంత్రి చాంబర్ గోడలను బుల్లెట్ ప్రూఫ్‌గా మార్పుచేయడంతోపాటు, బిర్లాటెంపుల్‌పై గార్డులను, అమృత క్యాజిల్‌పై ఔట్ పోస్టును ఏర్పాటు చేయడంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్ ఐపిఎస్ అధికారి ఒకరు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: