శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఎయిర్‌పోర్ట్ సిటీని నిర్మిస్తామని తెలంగాణ ప్రభుత్వానికి జీఎంఆర్ గ్రూపు ప్రతిపాదించింది. ఈ ఎయిర్‌పోర్ట్ సిటీలో 50 ఎకరాల్లో (సుమారు లక్ష చదరపు మీటర్ల విస్తీర్ణంలో) రూ. 750 కోట్ల పెట్టుబడితో అత్యున్నతస్థాయి ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మిస్తామని పేర్కొంది. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లిఖార్జునరావుతోపాటు సీఈవో ఎస్‌జీకే కిషోర్, విమానాశ్రయం చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్ సిటీ ప్రతిపాదన గురించి వారు వివరించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ (40 వేల చదరపు మీటర్లు) కంటే పెద్దదైన ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మిస్తామని తెలిపారు. దీనిపై సీఎంకు ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దీని ఏర్పాటు ద్వారా 15 వేల నుంచి 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ప్రభుత్వం తరఫున సహాయసహకారాలు అందించాలని విన్నవించారు. ఇందుకు కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు. వివిధ రంగాల వారు తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలుగా ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేస్తామని, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ హైదరాబాద్‌ను ప్రతిబింబించేలా రూపుదిద్దుతామని జీఎంఆర్ ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హామీ ఇచ్చారు. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో అమ్యూజ్‌మెంట్ పార్కు ఏర్పాటు, పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు మెడికల్ టూరిజం కేంద్రంగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. వీటన్నింటినీ అభివృద్ధి చేసేందుకు దక్షిణ హైదరాబాద్‌లో మంచి అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం శంషాబాద్ విమానాశ్రయంలో పది లక్షల టన్నుల కార్గోను చేపడుతున్నట్లు వివరించారు. కాగా, హైదరాబాద్‌కు ఉత్తరం వైపు(ఘట్‌కేసర్ వైపు) మరో విమానాశ్రయాన్ని నిర్మించాలని కంపెనీ ప్రతినిధులను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా కోరారు. అదేవిధంగా శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో మంచి ఆసుపత్రితో పాటు థీమ్ పార్కును అభివృద్ధి చేయాలని సూచించారు. పరిశ్రమలకు అవసరమైన అన్ని అనుమతులను సింగిల్ విండో విధానం ద్వారా ఇవ్వనున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఎటువంటి అవినీతికి తావులేకుండా చూస్తామని హామీనిచ్చారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో పన్నులు కనీసం పది శాతం తక్కువగా ఉండేలా చూస్తామన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు, మంత్రి జగదీశ్ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎంపీ బాల్క సుమన్, సీఎస్ రాజీవ్ శర్మ, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రలు పాల్గొన్నారు. telangana, airport city, shamshabad, తెలంగాణ, ఎయిర్ పోర్ట్ సిటీ, శంషాబాద్

మరింత సమాచారం తెలుసుకోండి: