విద్యుత్ పంపిణీ నష్టాలు తక్కువగా ఉన్న నగరాలు, పట్టణాలు, మండలాలకే తొలి ప్రాధాన్యంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత విజయవాడ నగరంతోపాటు మరికొన్ని మండలాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించినా, ప్రస్తుతం ఆ ఆలోచన విరమించుకుంది. ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా ఉన్న తిరుపతికి, పంపిణీ నష్టాలు తక్కువగా ఉన్న ఏలూరులకు నిరంతర విద్యుత్ సరఫరాకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. రెండు నగర పాలక సంస్థలు, 9 మున్సిపాలిటీలు, 39 మండలాలకు తొలి విడత నిరంతర విద్యుత్ సరఫరా అమలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ 2వ తేదీనుంచి 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై డిస్కంల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఓవైపు బొగ్గు కొరత, మరోవైపు జల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడంతో ప్రభుత్వ సంకల్పాన్ని నేరవేర్చడంపై అధికారులు నిరంతర సమాలోచనలు చేస్తున్నారు. గతంలో విజయవాడకు తొలి ప్రాధాన్యంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించినా, దాని డిమాండ్ కు సరిపడా సరఫరా చేయడం కష్టమవుతుందని వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. విజయవాడ,విశాఖ వంటి పెద్ద నగరాలను ఎంపిక చేసుకోవడంవల్ల, లక్ష్యం మేరకు సరఫరా చేయలేకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అన్ని విధాలా ఆలోచించిన అధికారులు ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిసింది. తిరుపతి, ఏలూరు నగర పాలక సంస్థలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలనే విషయాన్ని రెండు డిస్కంల అధికారులు ఖరారు చేసినట్లు తెలిసింది. తిరుపతిని పుణ్యక్షేత్రంగా, ఏలూరును విద్యుత్ నష్టాలు తక్కువగా ఉన్న నగరపాలక సంస్థగా ఎంపిక చేశారు. ఈ నగరంలో నాలుగు శాతంలోపే పంపిణీ నష్టాలున్నాయి. 9 పురపాలక సంఘాల్లోనూ... తక్కువ నష్టాలున్న వాటినే ఎంపిక చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి. 24 గంటల విద్యుత్ సరఫరాకు విద్యుత్ నష్టాలు తక్కువగా ఉన్నవాటినే పరిగణలోకి తీసుకొని, మిగిలిన చోట్ల మీటర్ సేల్స్ పెంచుకున్న తరువాతనే అమలులోకి తీసుకరావాలని ప్రభుత్వం భావిస్తోంది. 24 గంటల విద్యుత్ సరఫరాలో డిస్కంలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏపీజన్కో, ట్రాన్స్ కోలు చర్యలు ప్రారంభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: