వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని రెండుగా విభజించాలని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రం రెండుగా చీలిన నేపథ్యంలో జగన్ కొంచెం లేటుగానైనా తన పార్టీ ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ శాఖలుగా మార్చాలనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ శాఖకు కొత్త అధ్యక్షుడిని కూడా నియమించనున్నట్టు సమాచారం. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ ఉనికి ప్రమాదంలో పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకొంటున్నట్టు సమాచారం. పార్టీ తెలంగాణ అధ్యక్ష స్థానంలో వైఎస్ షర్మిలను నియమించాలని తెలంగాణ ప్రాంత నేతలు డిమాండ్ చేశారట. అయితే షర్మిల అందుకుసుముఖంగా లేదని చెబుతూ జగన్ మోహన్ రెడ్డి ఆమె స్టార్ క్యాంపెయినర్ గా ఉంటుందని సర్ధి చెప్పారట. ఎంపీ పొంగులేటి లేదా నల్లగొండ జిల్లా పార్టీ కన్వీనర్ గట్టు శ్రీకాంత్ రెడ్డికి తెలంగాణ విభాగం అధ్యక్ష పీఠాన్ని అప్పగించే అవకాశాలున్నాయని సమాచారం. అక్టోబర్ ఎనిమిదవ తేదీ ఇందుకోసం పార్టీ ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు. మొత్తానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎట్టకేలకూ తెలంగాణ శాఖ ఏర్పడుతుందని తెలుస్తోంది. తెలుగుదేశం వంటి పార్టీలు ఇప్పటికే తెలంగాణ శాఖను ఏర్పాటు చేశాయి. అయితే తెలంగాణ శాఖ ఉన్నప్పటికీ అది చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తోంది. ఏ చిన్న సమస్య అయినా చంద్రబాబే స్వయంగా జోక్యం చేసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కూడా అంతకు మించిన పరిస్థితి అయితే ఉండదనే అనుకోవాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: