ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత అరెస్టయిన నేపథ్యంలో తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్నది వేయిడాలర్ల ప్రశ్నగా మారింది. ప్రస్తుత ఆర్ధిక మంత్రి, మాజీ సిఎం పన్నీర్ సెల్వానికే చాన్స్ ఉంటుందని మెజారిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2001లో టాన్సీ భూముల కేసులో జయలలిత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు, ఆమె సెల్వానికే పట్టంగట్టిన విషయాన్ని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. తరువాత మద్రాస్ హైకోర్టు కేసును కొట్టివేశాక జయలలిత అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. అప్పుడు పన్నీర్ సెల్వం ఆమెకు ముఖ్యమంత్రి పదవిని పువ్వుల్లోపెట్టి అప్పగించారు. శనివారం బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు స్వయంగా హాజరైన జయలలిత.. కేసు విరామ సమయాల్లో రెండుసార్లు పన్నీర్ సెల్వంతో మంతనాలు జరపడం గమనార్హం. ప్రస్తుత కేబినెట్‌లో జయకు పన్నీరు సెల్వం వీరవిధేయుడు. నమ్మినబంటు. జయ పరోక్షంలో కూడా ప్రభుత్వం మీదగానీ, ముఖ్యమంత్రిపైగానీ ఏనాడూ పల్లెత్తుమాట మాట్లాడని వ్యక్తి ఆయన. శనివారం జయను దోషిగా ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించినప్పుడు పన్నీర్ సెల్వం కన్నీటి పర్యంతమయ్యారు. అయితే పన్నీర్‌తోపాటు మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వారిలో విద్యుత్ మంత్రి విశ్వనాథం, రవాణా మంత్రి వి సెంథిల్ బాలాజీ, మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారు షీలా బాలకృష్ణన్ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: