సహాయ చర్యల్లో బిజీగా ఉన్న చంద్రబాబు.. మీడియాపైనా చిర్రుబుర్రులాడారు. ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సిన మీడియా వారిని భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. మీరు ప్రజలకు సమాచారం చేరవేస్తారని భావిస్తే.... మీరు జనాన్ని కన్ ప్యూజ్ చేయాలని చూస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. సహాయ చర్యల తీరుతెన్నులపై బుధవారం ఆయన విశాఖలో ప్రెస్ మీట్ నిర్వహించారు. పాపం.. చాలా ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చారు. కొన్నిసార్లు విలేఖరులు చెప్పిన సూచనలను అధికారులను రాసుకోమన్నారు కూడా.. కానీ ఓ విలేకరి మాత్రం బాబును బాగా సతాయించాడు. అప్పటిదాకా శాంతమూర్తిగా ఉన్న చంద్రబాబు.. ఒక్కసారిగా సహనం కోల్పోయారు. ఏయ్.. నువ్వు గమ్మునుండు.. నేను నిన్ను శాటిస్ ఫై చేయడానికి రాలేదు. 90 శాతం ప్రజలను శాటిస్ ఫై చేయడానికొచ్చా. నీ ఓరియెంటేషన్ వేరుగా ఉంది. అది మంచిపద్దతి కాదని మండిపడ్డారు చంద్రబాబు. అయినా ఆ విలేఖరి తగ్గలేదు. సహాయ చర్యల్లో లోపాలను ఎత్తి చూపాడు. దాంతో చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చింది. డోన్ట్ ఆస్క్ మీ.. డోన్ట్ ఆర్గ్యూ విత్ మి.. అంటూ తీవ్రస్వరంతో హెచ్చరించారు. ఒకటి రెండు ఫోటోలు వేసి ఉన్నవీ లేనివీ అన్నీ రాస్తున్నారు.. ప్రత్యేకించి ఒకటి రెండు పత్రికలు అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారు..అంటూ ఫైరయ్యారు. మీడియాపైనే కాదు.. చంద్రబాబు సొంత పార్టీ నేతలకు, అధికారులకు కూడా ఘాటు హెచ్చరికలు చేశారు. అంతా నా వెనుకే తిరుగుతున్నారు.. ఇది మంచి పద్దతి కాదు.. సహాయ చర్యల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అని హితబోధ చేశారు. అంతేకాదు.. తన వెనుక ఐదు వాహనాలకంటే ఎక్కువ వస్తే అరెస్టు చేయిస్తానని తీవ్రస్వరంతో అన్నారు. చివరి వ్యక్తికి కూడా మేలు జరిగే వరకూ ఇక్కడే ఉంటానన్నారు చంద్రబాబు. బాధితులకు న్యాయం జరగడం లేదంటూ బ్యానర్లు కట్టుకుని వచ్చిన ప్రజాసంఘాల వారితోనూ చంద్రబాబు సానుకూలంగా మాట్లాడారు. మొత్తానికి చంద్రబాబు కూడా ఆ రెండు పత్రికలంటూ మొదలుపెట్టారన్నమాట.. అందులో ఒకటి సాక్షి అన్న సంగతి అందరికీ తెలిసిందే.. మరి ఇంకొకటేంటా అని జనం ఆలోచనలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: