ప్రతి రాజకీయ నాయకుడిలోనూ కొన్ని మంచి గుణాలుంటాయి. మరికొన్ని చెడు అంశాలూ ఉంటాయి. మంచివి పెంచుకుని.. చెడువి తగ్గించుకుంటే ప్రజల్లో ఇంకా పేరు తెచ్చుకుంటారు. ప్రజల మనిషిగా చరిత్రలో నిలుస్తారు. ఐతే.. అధికారం అనే మత్తు ఎక్కిన రాజకీయ నాయకుడికి ఈ విచక్షణ తగ్గిపోతుంది. ఇక తనంతవాడు లేడన్న గర్వం క్రమంగా పెరుగుతుంది. మళ్లీ జనం ఆ పెరిగిన తోకను కత్తిరించి అధికారం నుంచి దించేశాక కానీ తను చేసిన తప్పేంటో బోధపడదు. ఐతే.. ఒకటి రెండు సార్లు ఇదే అనుభవం ఎదురైన సీనియర్ నేతలు కూడా మళ్లీ అధికారం చేతికందగానే పాత సంగతులు మర్చిపోతుంటారు. అధికారంలో ఉన్న మత్తు మహత్యం అది. ఇప్పుడు చంద్రబాబుది అదే పరిస్థితి. చంద్రబాబు బాగా కష్టపడతారు. ఈ విషయాన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారు. కాకపోతే.. అంతా నేనే చేశాను.. అంతా నావల్లే జరిగింది.. నేనే పనిచేస్తాను.. మిగిలినవాళ్లంతా వేస్ట్.. అనే తత్వం ఆయనలో ఎక్కువ. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న సమయంలోనూ జరిగిందిదే.. జట్టు నాయకుడు.. జట్టు సభ్యులను కలుపుకుని వెళ్లకుండా.. తానొక్కడితోనే విజయం వస్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది. అధికారులు బాగా పనిచేయడం లేదు. మంత్రులు బాగా పనిచేయడం లేదు. పార్టీ క్యాడర్ బాగా పనిచేయడం లేదు. ప్రైవేటు సెల్ ఫోన్ ఆపరేటర్లు బాగా పనిచేయడం లేదు.. నేనొక్కడినే కష్టపడుతున్నా.. 15 రోజుల్లో చేయాల్సింది.. మూడు రోజుల్లోనే చేసి చూపించా.. ఇవీ విశాఖ తుపాను సహాయ చర్యల సమయంలో చంద్రబాబు మాట్లాడుతున్న డైలాగులు.. ఎవరూ బాగా పనిచేయనప్పుడు.. 15 రోజుల్లో చేయాల్సింది.. మూడురోజుల్లోనే ఎలా జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రే అన్నిపనులూ చక్కబెడుతున్నారా.. ఈ అనుమానాలు రాక మానవు. గతంలో ఇదే మైండ్ సెట్ తో అధికారులు, రాజకీయనాయకులను దూరం చేసుకున్న చంద్రబాబు.. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. మళ్లీ అధికారపగ్గాలు చేతికి రాగానే మళ్లీ పాత మైండ్ సెట్ లోకి వెళ్లిన బాబు.. త్వరలోనే అది మంచిది కాదని గుర్తించకపోతే.. ఆయన రాజకీయ భవిష్యత్తు పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: