శివసేనను దగ్గరగానే పెట్టుకోవడమా.. లేక తరిమేయడమా.. అనే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీనే నిర్ణయించేస్తాడని అంటున్నారు కమలనాథులు. వచ్చే వారంలో మోడీ ఈ విషయం గురించి నిర్ణయిస్తారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. "సామ్నా'' ఎడిటోరియల్ ద్వారా మోడీపై శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రే విరుచుకుపడిన విషయం తెలిసిందే. పరుషమైన పదజాలంతో మోడీపై విరుచుకుపడ్డాడాయన. బీజేపీని కూడా ద్రోహి అభివర్ణించాడు. ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, శివసేన మైత్రి ప్రశ్నార్థకం అయ్యింది. బీజేపీ వాళ్లు శివసేనతో తెగదెంపులు చేసుకోవడం కాయమని.. శివసేన మోడీ క్యాబినెట్ నుంచి బయటకు వచ్చేస్తుందని అందరూ అంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికల షెడ్యులు వచ్చినప్పటి నుంచినే శివసేన, బీజేపీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల పొత్తు కూడా కుదరకపోపోవడంతో ఈ రెండు పార్టీలూ ఒకదానిపై మరోటి విరుచుకుపడే పరిస్థితి మొదలైంది. అయితే శివసేన, బీజేపీ ల మధ్య స్నేహం ఇంతటితో చెరిగిపోయిందని చెప్పడానికి లేదు. ఎలాగూ మహారాష్ట్రలో బీజేపీకి సోలోగా మెజారిటీ రాదు. మరో పార్టీ అవసరం ఉండనే ఉంటుంది. ఇటువంటి పరిణామాల మధ్య భారతీయ జనతా పార్టీ శివసేన సహాయంతోప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలూ లేకపోలేదు. కాబట్టి ఈ రకంగా చూస్తే బీజేపీకి శివసేన అవసరం ఉంటుంది. మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై ఎన్నికల ఫలితాలు రావడంతో ఫుల్ క్లారిటీ వస్తుంది. ఆ మాత్రం క్లారిటీ వస్తే.. శివసేనను దగ్గరగానే ఉంచుకోవడమా లేక తరిమేయడమా.. అనేది మోడీ డిసైడ్ చేస్తాడని తెలుస్తోంది. మరి వీళ్ల పాతికేళ్ల స్నేహం క్లైమాక్స్ కామెడీ అవుతుందో, ట్రాజెడీ అవుతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: