బంగాళాఖాతంలో ఏర్పడే తుపానులతో ఎక్కువగా నష్టపోయే రాష్ట్రాల్లో ఒడిశా ఒకటి. ఎన్నో భయంకరమైన తుపానులను ఈ రాష్ట్రం ఎదుర్కొంది. లక్షల సంఖ్యలో జనం మృత్యువాత పడిన విపత్తులు ఈ రాష్ట్ర చరిత్రలో ఉన్నాయి. 1999లో ఒడిశాను ప్రచండ తుపాను కుదిపేసిన సమయంలో ఏపీ సర్కారు చొరవ చూపి ఆపన్నహస్తం అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఉత్తరాంధ్ర నుంచి అధికారులను, సహాయ సామగ్రిని పంపి.. సాయమందించారు. ఏపీ సరిహద్దు ఒడిశా జిల్లాల్లో ఒడిశా సర్కారు కంటే.. ఏపీ సర్కారే ఎక్కువ సాయం అందించింది. ఇప్పుడు ఒడిశాకు ఏపీ రుణం తీర్చుకునే అవకాశం లభించింది. హుదుద్ ధాటికి కుదేలైన ఉత్తరాంధ్రను ఆపత్కాలంలో ఆదుకునేందుకు ఒడిశా ముందుకొచ్చింది. సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొంటోంది. ఒడిశా ప్రభుత్వం 450మంది అగ్నిమాపక సిబ్బందిని.. మరో వంద మంది ఓడ్రాఫ్ సిబ్బందిని పంపింది. ఈ బృందాలు కట్టర్లు, టవర్ లైట్లు వంటి పరికరాలు వెంట తెచ్చుకుని.. తమ వంతు సాయం చేస్తున్నారు. ఒడిశా సరిహద్దు జిల్లాల నుంచి కొత్తగా ట్రాన్స్ ఫార్మర్లు అమచ్చి.. ఏపీలోని సరిహద్దు ప్రాంతాలకు విద్యుత్ అందిస్తున్నారు ఆ రాష్ట్ర అధికారులు. గంజాం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా ఇఛ్చాపురం పట్టణానికి... గజపతి జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి విద్యుత్ అందిస్తున్నారు. అంతేకాదు.. మరికొన్ని సంస్థలు.. భారీ పరిమాణంలో పాలు, నిత్యావసరాలు సరిహద్దు జిల్లాలకు అందిస్తూ సాయం చేస్తున్నాయి. భువనేశ్వర్, బరంపురం తదితర ప్రాంతాల నుంచి ఏపీకి పాలు పంపామని ఒడిశా అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: