ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో తేదేపా అభ్యర్ధిని బరిలో దింపాలనే ఆపార్టీ యోచిస్తోంది. గతంలో శాసనసభ్యులు చనిపోయిన స్ధానాల్లో వారి కుటుంబసభ్యులు బరిలో దిగితే పోటీ చేయకూడదనే సాంప్రదాయాన్ని గత దశాబద్దన్నర కాలంగా రాష్ర్టంలోప్రధాన పార్టీలు పాటిస్తున్నాయి. ఇటీవల జరిగిన నందిగామ ఉప ఎన్నికల్లోను టిడిపి అభ్యర్ధి తంగిరాల సౌమ్యపై పోటీకి వైసిపి దూరంగా ఉంది. కాంగ్రెస్‌పార్టీ పోటీ చేసినప్పటికీ వైసిపి మాత్రం బరిలో నిలబడలేదు. అందుకు కారణం ఆళ్లగడ్డ ఎన్నికల్లో తేదేపా పోటీ చేయదని, పాతసాంప్రదాయాన్ని పాటిస్తుందని భావించింది. అనూహ్యంగా తేదేపా మాత్రం ఆళ్లగడ్డలో పోటీచేయాలని భావిస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన తేదేపా నేతలు, కార్యకర్తలుతో పార్టీ అధినేత చంద్రబాబు,యువనేత లోకేష్‌ బాబు చర్చలు జరుపుతున్నారు. ఆళ్లగడ్డ బరిలో నిలిచి విజయం సాధించాలని కర్నూలు జిల్లా నేతలు, కార్యకర్తలు ఊవ్విళ్లూరుతున్నారు. పార్టీ సమావేశంలో ఏక గ్రీవ తీర్మానం చేసి పార్టీ అధినేతకు పంపిచినట్లు తెలిసింది. శుక్రవారం ఇక్కడ ఎన్‌టిఆర్‌ భవనలో ఆపార్టీ యువనేత లోకేష్‌తో కర్నూలు జిల్లాకు చెందిన ఎంపి ఎస్‌పివైరెడ్డి,ఉపముఖ్యమంత్రి కె.ఇ కృష్టమూర్తి, జిల్లా పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీమంత్రులు టిజి వెంకటేష్‌, శిల్పా మోహన్‌రెడ్డి, లబ్బివెంకటస్వామి, పార్టీ అభ్యర్ధి గంగుల ప్రతాప్‌రెడ్డితో సమావేశం అయ్యారు. ఆళ్లగడ్డ ఎన్నికల్లో బరిలో అభ్యర్ధి బరిలోదించితే విజయావకాశాలపైన లోతైన చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రస్తుతం నియోజక వర్గంలో పార్టీ స్ధితిగతులు, కార్యకర్తల అభిప్రాయాలు చర్చకు వచ్చాయి. సమావేశానికి హాజరైననేతలను ఒక్కక్కరిగా పిలిచి లోకేష్‌ అభిప్రాయాలను తీసుకున్నారు. ఆళ్లగడ్డలో వైయస్‌ఆర్‌పార్టీ నేత శోభానాగిరెడ్డిపైప్రజల్లో సానుభూతి ఎలా ఉంది? ఎన్నికల్లోప్రభావం ఉంటుందా? తదితర అంశాలను ఆరా తీశారు. ఎన్నికల ముందు శోభా మృతి చెందడంతో సానుభూతితోనే కేవలం 17వేల ఓట్లు వచ్చాయని, ఆమె ఉంటే తేదేపా అభ్యర్ధి విజయం సాధించేవారని వారు లోకేష్‌కు వివరించారు. ప్రస్తుతం పూర్తిగా ఆమె సానుభూతి తగ్గిపోయిందని, నాగిరెడ్డి పరిస్ధితి కూడా అంతబాగాలేదని తెలిపినట్లు సమాచారం.ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమపధకాలు, అధినేత పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసంతో తేదేపా అభ్యర్ధి సునాయాసంగా గెలుపొందుతారనే విశ్వాసాన్ని నేతలు యువనేతకు అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలిసింది. జిల్లాకు చెందిన తేదేపా పార్టీ నేతలు అందరు ఏకతాటిపై నిలబడి అభ్యర్ధి విజయానికి కృషి చేస్తామంటే బరిలో నిలపేందుకు తాము సిద్దంగా ఉన్నామనే సంకేతాలను ఇచ్చినట్లు తేదేపా నేతలు చెబుతున్నారు. అభ్యర్ధి విషయంలోను చర్చకు రాగా పాతవారినే కొనసాగిస్తే బాగుంటుందని నేతలు లోకేష్‌కు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది.  ప్రస్తుతం పార్టీ అధినేత తుఫాన్‌ సహాయపునరావస చర్యలో నిమగ్నమై ఉండటం వల్ల ఆయన వచ్చిన తరువాత పోటీపై నిర్ణయం తీసుకుంటామని యువనేత వారికి భరోసా ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. రెండు రోజుల్లోనే పోటీ విషయంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని తేదేపా వర్గాలు పేర్కొంటున్నాయి. ఆళ్లగడ్డ ఎన్నికల్లో టిడిపి పార్టీ అవకాశం ఇస్తే తాను బరిలో ఉంటామని ఆపార్టీ నేత గంగుల ప్రతాప్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎన్‌టిఆర్‌ ట్రస్టు భవన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ యువనేత లోకేష్‌తో సమావేశమై తమ కార్యకర్తల అభిప్రాయాన్ని వెల్లడించామన్నారు. అధినేత ఆదేశాలే తమకు శిరోధార్యమన్నారు. పోటీ చేస్తే మాత్రం తప్పకుండా విజయం సాధిస్తామని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: