కరీంనగర్‌ కాంగ్రెస్‌ ధర్నా ఉద్రిక్తంగా మారింది. నేతల అరెస్టులు, తోపులాటకు దిగిన కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జి, వారి తీరుపై నాయకుల ఆగ్రహం.. తదితర ఘట్టాలు రణరంగాన్ని తలపించాయి. కరెంట్‌ కోతలను నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రైతు ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు, రైతుల పెద్ద ఎత్తున తరలివచ్చారు. కలెక్టరేట్‌ ప్రధాన గేటు ఎదుట జరిగిన ఈ ఆందోళనలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మండలిపక్ష నేత డి. శ్రీనివాస్‌, సీఎల్‌పీ నేత జానారెడ్డి, మండలిపక్ష ఉపనేత షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌, డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. సుమారు మూడు గంటల పాటు కొనసాగిన ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్‌ తమ వద్దకు వచ్చి సమస్య పరిష్కారంపై హామీ ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.  కలెక్టరేట్‌ గేట్లు మూసి ఉండటం, రోడ్డుపై ఆందోళన కొనసాగుతుండటంతో ధర్నా విర మణ కోసం పోలీసులు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా కలెక్టరేట్‌లోనికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. గేటును తెరిపించేందుకు తోపులాటకు దిగగా పోలీసులు అడ్డుకున్నారు. తోపులాటలు, పెనుగులాట నేపథ్యంలో తమను లోపలికి అనుమతించాలంటూ జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, వివేక్‌, మృత్యుంజయం తదితరులు గేటు ఎదుట బైఠాయించారు. దీంతో పోలీసులు డీఎస్పీ రవీందర్‌ ఆధ్వర్యంలో నేతలను అదుపులోకి తీసుకొని జీపుల్లోకి చేర్చారు. మల్టిఫ్లెక్సు వద్ద కార్యకర్తలు ఆ వాహనాలను అడ్డుకున్నారు. దీంతో వాహనాల నుంచి కిందికి దిగిన శ్రీధర్‌బాబు సహా నేతలందరూ అక్కడే ధర్నాకు దిగారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  నేతలు ఎంతకూ పైకి లేవకపోవడం, కార్యకర్తల నుంచి ఒత్తిడి మొదలవుతుండటంతో పోలీసులు గత్యంతరం లేక స్వల్పంగా లాఠీచార్జి చేశారు. ఒకరిద్దరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసుల తీరుపై కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. అనంతరం పోలీసులు నేతలను మళ్ళీ అదుపులోకి తీసుకొని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కరీంనగర్‌లో శుక్రవారం డిప్యూటీ సీఎం రాజయ్య పర్యటిస్తుండగా అదేసమయంలో కాంగ్రెస్‌ ధర్నా కొనసాగుతుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలతో ధర్నా విజయవంతం కాగా కాంగ్రెస్‌ నేతల అరెస్టు ప్రక్రియ వర కు పోలీసులు ఆచితూచి వ్యవహరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: