హుదూద్ తుపాను ప్రభావం ఒక్క నగరాలకే పరిమితం అనుకుంటున్నారేమో.. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కేవలం నగరాలకే పరిమితమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలను సందర్శించి, వారి గోడు వినేవారే కరువయ్యారు. చిమ్మచీకట్లో కనీసం కిరోసిన్ దీపం వెలిగించుకోలేని దుస్థితిలో గ్రామీణ ప్రాంత బాధితులు అల్లాడుతున్నారు. గత ఆదివారం తీవ్ర పెనుగాలులతో విధ్వంసం సృష్టించిన తుపాను సద్దుమణిగి ఐదు రోజులు పూర్తయినా, నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో బాధితులకు సాయం అందట్లేదు. ఎమ్మెల్యే, మండల స్థాయి ప్రజాప్రతినిధులు మాత్రం పర్యటిస్తూ వారి బాధలు వింటున్నారు తప్ప సాయం అందించే పని మాత్రం చేయట్లేదు. నగరానికి సమీపంలో ఉన్న భీమిలి రూరల్, ఆనందపురం, పద్మనాభం, సబ్బవరం, కె కోటపాడు, పరవాడ మండలాల్లో కూడా బాధిత కుటుంబాలకు సాయం అందలేదంటూ ఆరోపిస్తున్నారు. చోడవరం నియోజకవర్గ పరిధిలో తుపాను విధ్వంసం అపార నష్టాన్ని కల్గించింది. నియోజకవర్గాల వారీగా మంత్రులను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. భీమిలి నియోజకవర్గానికి సాక్షాత్తూ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ కూడా బాధిత కుటుంబాలకు సాయం కేవలం పట్టణ ప్రాంతానికే పరిమితమైంది. నియోజకవర్గ పరిధిలోని పద్మనాభం, ఆనందపురం మండలాలను కనీసం సందర్శించిన పాపానపోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేక ప్రజలు అల్లాడుతున్నారు. రక్షిత మంచినీటి మాట ఏనాడో మర్చిపోయారు. నగరాల్లో మంచినీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న ప్రభుత్వం, గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. విద్యుత్ లేకపోగా, ఇళ్లలో దీపం వెలిగించుకునేందుకు కొవ్వొత్తులు, కిరోసిన్ సరఫరా చేయాలని గ్రామీణ ప్రజానీకం వేడుకుంటున్నారు. ఈ నియోజకవర్గానికి దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావును ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. భీమిలిలో కొంతమందికి మాత్రం నిత్యావసర సరుకులను పంపిణీ చేసి చేతులుదులుపుకున్నారు.  ఇప్పటి వరకూ గ్రామీణ ప్రాంతాల్లో మంత్రులు పర్యటించకపోవడానికి ప్రత్యేకించి కారణాలు లేనప్పటికీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం పట్ల మాత్రం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెందుర్తి, చోడవరం నియోజకవర్గాల్లో సైతం పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. పెందుర్తి, సబ్బవరం, పరవాడ మండలాల్లో స్థానిక ఎమ్మెల్యే, ఎంపి మాత్రం నిత్యం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధిత కుటుంబాలను ఓదారుస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించే విషయంలో మాత్రం ఎవరూ ముందుకు రావట్లేదు. దీంతో ప్రభుత్వం నుంచి సాయం రాక, దాతలు అందించే సాయం తమ వరకూ చేరక బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: