ఆపదలో ఉన్న ఉత్తరాంధ్రను ఆదుకునేందుకు అన్ని వర్గాల వారు ముందుకు వస్తున్నారు. రాజకీయనాయకులు, సినీతారలు, ఉద్యోగులు,వ్యాపారస్తులు, వాణిజ్య సంస్థలు..ఇలా అంతా తలో చేయి వేస్తున్నారు. డబ్బు, వస్తువులు, ఆహార పదార్థాలు.. అన్ని రూపాల్లోనూ ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. విశాఖ కలెక్టరేట్ ఆవరణలో బస చేస్తున్న చంద్రబాబును శుక్రవారం పలువురు ప్రముఖులు కలసి భారీగా విరాళాలు అందించారు. గీతం విశ్వవిద్యాలయ అధినేత, మాజీ ఎంపీ మూర్తి 50 లక్షల రూపాయలు అందజేశారు. రాష్ట్ర మత్స్యరైతుల సంఘం 20 లక్షల రూపాయల సాయం అందించింది. హోస్పిరా ఫార్మా సంస్థ లక్షడాలర్లు అంటే దాదాపు 60 లక్షల రూపాయల విరాళాన్ని చంద్రబాబుకు అందించారు. వీరితో పాటు మరికొన్నిసంస్థలు 5 నుంచి 15 లక్షల రూపాయలు విరాళం గా అందించాయి. ఇక తుపాను సహాయ నిధికి రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు భారీ స్థాయిలో విరాళం ప్రకటించారు. ఏపీఎన్జీవోలు, ఉపాధ్యాయులు, ప్రభుత్వరంగ సంస్థల కార్మికులు.. తమ రెండు రోజుల వేతనం... దాదాపు 125 కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. దీంతో సీఎం సహాయనిధి మొత్తం ఒక్కసారిగా 225 కోట్లకు చేరింది. వీరితో పాటు ఏపీ ఉన్నతవిద్యామండలి ఉద్యోగులు, ఎన్టీరంగా విశ్వవిద్యాలయ ఉద్యోగులు, ఏంపీడీవోలు కూడా తమ ఒకరోజు జీతాన్ని విరాళంగా అందించారు. కార్పొరేట్ సంస్థల నుంచి కూడా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే ఏపీలో ఉత్పత్తి ప్రారంభించాలని నిర్ణయించిన హీరో మోటార్ కార్ప్ సంస్థ కోటి రూపాయల విరాళాన్ని కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకు అందించింది. దేశంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైనా టాటా సంస్థ.. 3 కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. రతన్ టాటా చంద్రబాబుతో నేరుగా ఫోన్ లో మాట్లాడి.. విరాళం ప్రకటించారు. మరోవైపు రాజకీయ నేతల విరాళాలు కూడా కొనసాగుతున్నాయి. ఎంపీ సుబ్బిరామిరెడ్డి 2 కోట్లు, మరో ఎంపీ గల్లా జయదేవ్ కోటి రూపాయలు విరాళం ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: