విశాఖ... ఏపీలో అత్యంత సుందర నగరం. ప్రకృతి సోయగాలకు నెలవు. పర్యాటకులకు స్వర్గధామం. పెట్టుబడులకు బంగారు బాతు. ఐతే.. కాలం చెక్కిలిపై ఘనీభవించిన కన్నీటి చుక్క హుదుద్... ఈ సమీకరణలపై ఎన్నో అనుమానాలు రేకెత్తించింది. కొత్త పరిశ్రమలు దేవుడెరుగు... ఉన్న పరిశ్రమలే నిలుస్తాయో లేదో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే ప్రభుత్వం మాత్రం వీటిని ఊహాగానాలుగానే కొట్టిపారేస్తోంది. విభజన తర్వాత పెట్టుబడులు విశాఖ తలుపులు తడతాయని అంతా భావించారు. దానికి బలం చేకూర్చే దాఖలాలూ కనిపించాయి. ఐతే సడన్ గా హుదుద్ ఉపద్రవం వచ్చి... పెట్టుబడులపై సందేహాలు రేకెత్తిస్తోందిహుదుద్ తుపానుకు విశాఖ అతలాకుతలమైంది. విపరీతమైన గాలులకు బహుళ అంతుస్తుల భవనాలే దెబ్బతిన్నచోట... చిన్నా చితకా బిల్డింగుల మాట ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రవాణ, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించాయి. ఇపుడు ఇవే విశాఖ పెట్టుబడులపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రకృతి విపత్తు చూసి పెట్టుబడిదారులు ముందుకు వస్తారా? ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇవి అసలు సమస్యే కాదని చెబుతున్నాయి. రాష్ట్ర ప్రకృతి విపత్తులు సాధారణమేనని... ఐతే ఇవి అభివృద్దికి ఆటంకం కానే కావని సర్కారు బలంగా విశ్వసిస్తోంది. పైగా విపత్తుల తాకిడికి గురవుతూనే అభివృద్ధిలో పురోగమిస్తున్న దేశాలు, నగరాలను ఉదాహరణగా చెబుతున్నారు. పెట్టుబడుల తగ్గవని... చంద్రబాబు సర్కారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా... లోలోపల మాత్రం మదనపడుతోంది. అందుకే సాకులు వెతకకుండా... కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందే అని భావిస్తోంది. విశాఖ పెట్టుబడులపై ప్రమాద ఘంటికలు మోగుతుండటంతో... ఆ సంకేతాలను ప్రభుత్వం తొందరాగనే పసిగట్టినట్లుంది. అందుకే చికిత్స పనులు వేగవంతం చేసింది. తద్వారా పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించాలని భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: