తెలంగాణ ప్రభుత్వానికి క్రమక్రమంగా ప్రజల అసంతృప్తి సెగ అంటుకుంటోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఏ ఒక్కటీ సజావుగా అమలు గావడం లేదు. ప్రజల్లో రోజురోజుకు అసహనం వ్యక్తమవుతోంది. రైతుల రుణమాఫీ, విద్యార్థుల ఫీజుల నుండి విద్యుత్‌ కోతలు, పింఛన్ల పంపిణీ, శాంతిభద్రతల వరకు అన్నివర్గాల ప్రజలకు కెసిఆర్‌ ప్రభుత్వంపె పెట్టుకున్న నమ్మకం సడలుతోంది. రుణమాఫీ జరగక కొత్త రుణాల కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు పండక, చేసిన అప్పులు తీర్చేమార్గం కనిపించక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల ఇంట రోదనలు వినిపిస్తున్నా ఆ కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రభుత్వం సిద్ధపడడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తూ అధికార పార్టీ కార్యకర్తలే ప్రభుత్వ తీరుపట్ల అసహనంతో ఉంటున్నారు. తమ ఫీజులు చెల్లిస్తుందో లేదోనని విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. విద్యుత్‌కోతలతో పారిశ్రామిక వర్గాలు, కార్మికులకు పాలుపోవడం లేదు. క్రమబద్దీకరణ కోసం కాంట్రాక్టు ఉద్యోగులు ఆశ పెట్టుకున్నారు. శాంతిభద్రతలు ప్రభుత్వం చేయిజారిపోయినట్లుగా ఉంది. హైదరాబాద్‌లో ఏదో మూలాన అవాంఛనీయ సంఘటనలు జరగని రోజూ కనిపించడం లేదు. పోలీస్‌స్టేషన్లో కేసులు నమోదు కాని సందర్భాలూ లేవు. పథకాల అమలులో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ముందుకుపోతున్నా నిధుల కేటాయింపునకు వెనుకడుగు వేయడమే ప్రజల అసంతృప్తికి కారణమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్‌, టిడిపి, బిజెపిల ఆందోళనలు ఎలా ఉన్నా వామపక్షల పార్టీలూ ఆందోళనకు పిలుపు ఇవ్వడం ప్రభుత్వానికి సెగ తగిలినట్లుగా కనిపిస్తోంది. తమపై వస్తున్న వ్యతిరేకతను పోగొట్టేందుకు కెసిఆర్‌ ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లలో మునిగి తేలింది. కొత్త ఆహారభద్రత కార్డులను జారీ చేసేవరకు పాత కార్డులను ఉపయోగించుకోవచ్చని గురువారం ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ తెలియజేశారు. ఫాస్టు పథకంపై శుక్రవారం నాటికి విధివిధానాలను విడుదల చేస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. కొత్త రుణాల పంపిణీకి బ్యాంకర్లతో సమావేశం కాబోతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి పోచారం వెల్లడించారు. ఇలా వివిధ అంశాలపై మంత్రులు ముగ్గురు ఒకేరోజు స్పందించారంటే ప్రజల వ్యతిరేకతే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: