ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం దాదాపు ఖాయం అని తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శోభానాగిరెడ్డి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మరణించడం, ఎన్నికల్లో ఆమె గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే. శోభ వారసురాలిగా ఆయన కూతురు ఇక్కడ వైసీపీ తరపున పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎన్నిక ఏకగ్రీవంగా జరగడానికి సహకరించాలని వైసీపీ వాళ్లు టీడీపీని కోరారు. అయితే టీడీపీ మాత్రం ఈ విషయంలో వైసీపీ విజ్ఞప్తిని మన్నించే అవకాశాలు కనపడటం లేదు. శోభ తనయకు వ్యతిరేకంగా టీడీపీ అభ్యర్థిని నిలిపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన గంగుల ఫ్యామిలీ నుంచి ఒకరు ఈ సారి టీడీపీ అభ్యర్థిగా ఉండటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మరి నందిగామలో వైసీపీ పోటీ పెట్టలేదు కదా.. ఇప్పుడు టీడీపీ ఎలా పోటీ పెడుతుంది? అంటే.. తెలుగుదేశం నేతలు ఒక ఆసక్తికరమైన పోలిక చెబుతున్నారు. వెనుకటికి అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ పెట్టింది కదా.. అని టీడీపీ వారు అంటున్నారు. పెనుకొండ ఎమ్మెల్యే అయిన పరిటాల రవి హత్య కు గురి కావడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. టీడీపీ తరపున రవి భార్య సునీత బరిలోకి దిగింది. కాంగ్రెస్ తరపున ఒక అభ్యర్థి పోటీలో దిగాడు. పరిటాల ప్రధాన ప్రత్యర్థులు అయిన మద్దెల చెరువు సూరి కుటుంబం వారికిమాత్రం కాంగ్రెస్ టికెట్ నిరాకరించింది. వేరే అభ్యర్థిని బరిలో దింపింది. మరి అప్పుడు కాంగ్రెస్ తమకు సహకరించలేదు కాబట్టి.. ఇప్పుడు పోటీకి సిద్ధ పడటంలో తప్పేం ఉందని టీడీపీ వాళ్లు వాదిస్తున్నారు. మరి అప్పుడు పోటీ చేసింది కాంగ్రెస్, ఇప్పుడు ఏకగ్రీవానికి అడుగుతున్నది వైఎస్సార్ కాంగ్రెస్. అందులోనూ నందిగామలో వైసీపీ పోటీ కూడా చేయలేదు. మరి ఈ పోలిక చెల్లుబాటు అవుతుందా?!

మరింత సమాచారం తెలుసుకోండి: